Tuesday, November 26, 2024

ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతున్నారు : మండలి చైర్మన్‌ గుత్తా

ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీజేపీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లక్షల కోట్లు దోచుకున్న కార్పొరేట్ దొంగల వ‌దిలి.. లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దురాలోచన చేసి ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అద్భుతమైన పనితీరుతో మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్‌కు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విపక్షాలపై ఫైరయ్యారు. టీఎస్‌పీఎస్సీ స్వతంత్ర సంస్థ అని, కొంతమంది స్వార్థంవల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దోషులపై కఠిన చర్యలు చేపట్టిందని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్ధంకావడం లేదని విమర్శించారు. అసత్యాలు ప్రచారం చేయడమే వారి పనని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ విషం కక్కడం సరికాదని, కక్ష్య సాధింపు ధోరణి మంచిది కాదని సూచించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని మండలి చైర్మన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement