Tuesday, November 26, 2024

Delhi | సీటు రాకుండా అడ్డుకుంటున్నారు.. భట్టిపై వీహెచ్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) ధ్వజమెత్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. మొదట ఆ స్థానం నుంచి తనకే అవకాశం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించే వేళ తనను పట్టించుకోవడం లేదని అన్నారు.

తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకుని గద్గదస్వరంతో మాట్లాడారు. భట్టి విక్రమార్క ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు తానే కారణమని వ్యాఖ్యానించారు. తాను స్థానికుడు కాదని చెబుతున్న నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, పీవీ రంగయ్య నాయుడు స్థానికులా? వారు కూడా ఖమ్మం నుంచే పోటీ చేసి గెలుపొందలేదా?” అంటూ ప్రశ్నించారు.

పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేస్తూ వచ్చానని, గత ఏడేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానం తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీల ఓట్లు పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓట్లు వేసే మిషన్లుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ‘న్యాయ’ యాత్ర, బీసీ కుల గణన అంటున్నారని, ఆయనే తనకు న్యాయం చేయాలని అన్నారు.

ఖమ్మం టికెట్ రాకుంటే పార్టీ మారతారా అని ప్రశ్నిస్తే.. తనకు అలాంటి ఆలోచనే లేదని, చచ్చేవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని అన్నారు. తను చనిపోయిన తర్వాత సైతం శరీరంపై పార్టీ జెండా ఉంటుందని చెప్పారు. ఈ వయస్సులో విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికలు, పోటీలు అవసరమా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకేమీ వయసు అయిపోలేదని, ఎవరితో పరుగు పందెం పెడతారో చెప్పండి పాల్గొంటానని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేస్తున్న తనకంటే అర్హులు ఇంకెవరు ఉన్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో ఆ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement