Monday, November 18, 2024

Delhi | అవి ప్రతిపక్షాలు కావు, విధ్వంస శక్తులు.. ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ప్రతిపక్షాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా సభ సజావుగా జరగనివ్వకుండా అడ్డుకుని అభివృద్ధి కంటకులుగా మారారని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం, ప్రతిష్ట, స్థాయి పెరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని జీవీఎల్ అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తాము భారతీయులైనందుకు గర్వపడుతున్నామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

గడచిన 75 ఏళ్లలో రాని గుర్తింపు ఇప్పుడు భారత్‌కు వస్తోందని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలనైనా సజావుగా జరగనీయకపోతే ప్రజలు క్షమించరని, ఎన్నికల్లో తగినరీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. ప్రభుత్వం ధరల పెరుగుదల సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు సైతం తీవ్రమైన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో సతమతం అవుతుంటే భారత్ మాత్రమే కట్టడి చేసి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిందని అన్నారు. ప్రతిపక్షాలు సంధించే ఏ ప్రశ్నకైనా ధీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, కానీ ప్రతిపక్షాలే అందుకు సిద్ధంగా లేవని అన్నారు.

- Advertisement -

మరోవైపు బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశం గురించి మాట్లాడుతూ కూటమి పేరు మార్చినా ఫలితం మారదని అన్నారు. ఆ కూటమిలోని పార్టీలన్నింటిలోనూ కనిపించే లక్షణం అవినీతి, కుటుంబ రాజకీయాలేనని అన్నారు. ప్రజలను మభ్య పెట్టే కూటమి అంటూ ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ అంశాల గురించి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికీ చేయనంత సహాయం కేంద్రం ఏపీకి చేస్తోందని అన్నారు. ఏపీ పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధ ఏ పార్టీకీ లేదని వ్యాఖ్యానించారు. జనాభాలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కంటే ఎక్కువ మొత్తంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరయ్యాయని తెలిపారు. తాజాగా ఆర్థిక లోటును ప్రత్యేక కేసుగా పరిణగిస్తూ రూ. 10,500 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం మరో రూ. 13వేల కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం నెరవేర్చాల్సిన హామీల గురించి అడిగేవారు రాష్ట్రంలో తామిచ్చిన హామీల సంగతేంటో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వైఎస్సార్సీపీకి ఒక రాజకీయ ఎజెండా మాత్రమేనని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement