Saturday, November 23, 2024

Delhi | ఆత్మహత్యలు కావు, అవి ప్రభుత్వ హత్యలే.. రేవంత్ రెడ్డి ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సైతం సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ ఆయన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజి, పరీక్షల రద్దు, వాయిదాల కారణంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని రేవంత్ ఆరోపించారు.

ఒక యజ్ఞంలా భావిస్తూ బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజి జరిగితే బాధ్యులను గుర్తించకుండా.. సరైన విచారణ జరిపించకుండా సీఎం కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం ఫలితంగానే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని విమర్శించారు.

ఈ మొత్తం వ్యవహారంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓ రెండు నెలలు ఓపిక పట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మొత్తం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని వెల్లడించారు. “ఈ ప్రభుత్వ తప్పిదాలకు మీ ప్రాణాలు బలితీసుకోకండి. వయస్సు మీదపడ్డ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి” అంటూ నిరుద్యోగ యువతకు హితవు పలికారు.

- Advertisement -

నిజాం నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సంతకం చేసి అమలు చేస్తుందని వెల్లడించారు. అన్ని సమస్యలకు పరిష్కారం సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమేనని, ఈ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో పాటు అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా తాను మరొక గ్యారంటీ ఇస్తున్నానని, అది ‘ప్రజాస్వామ్యం’ అని రేవంత్ అన్నారు. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రవల్లిక ఘటనపై పోలీసు యంత్రాంగం చేస్తున్న ప్రకటనలను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడం ప్రభుత్వ నీచ మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు చనిపోయిన వారిపై అభాండాలు వేస్తుందని సూత్రీకరించారు.

ఆయన చెప్పారంటే అధికారిక సమాచారమే

తెలంగాణ అభ్యర్థుల జాబితాపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. శుక్రవారం నాటి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని, ఒకట్రెండు రోజుల్లో మిగతా స్థానాల కసరత్తు కూడా పూర్తిచేస్తామని అన్నారు. జాబితా ఎప్పుడు ప్రకటిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అభ్యర్థుల పేర్లను ప్రకటించేది తాను కాదని, అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు.

ఆదివారమే విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ చెప్పారు కదా అంటే.. ఆయన చెప్పారంటే అది కచ్చితమైన సమాచారమేనని తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ గురించి కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్టు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు షెడ్యూల్ పూర్తిస్థాయిలో ఖరారవుతుందని అన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో అగ్రనేతలిద్దరూ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement