Thursday, December 12, 2024

KTR | వారుకూడా తెలంగాణ‌ మాతృమూర్తులే.. ఏమిటీ దౌర్జన్యం

గ్రామ ప్రజలందరికీ మాతృమూర్తులుగా వ్యవహరిస్తోన్న తెలంగాణ తల్లుల‌పై ఏంటీ దుర్మార్గం.? ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ డిమాండ్ల సాధనకు కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. మీరు రెచ్చగొట్టి పోలీసులను అవమానించి, కొట్టి స్పృహ కోల్పోయేలా చేసిన ఆడవాళ్లంతా కూడా తెలంగాణ తల్లులే అని అన్నారు.

- Advertisement -

కేటీఆర్ ట్వీట్…

‘‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం ? ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా ? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా ? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా ? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు.’ అని పేర్కొన్నారు. అటు, మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆశావర్కర్ల ఆందోళన..

కాగా, హైదరాబాద్​లోని కోఠిలోని డీఎంఈ కార్యాలయం గేటు ముందు ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైటాయించారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆశా వర్కర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏసీపీ శంకర్‌ను ఒక్కసారిగా ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో పరిస్థితి విషమించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వారిని పోలీసులు వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఓ ఆశా వర్కర్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకుంది. తాను చెయ్యి పెట్టినట్లు గమనించకుండా డోర్ వేయడంతో వెంటనే స్పందించిన ఆ ఆశా వర్కర్ సీఐ చెంప చెళ్లుమనిపించారు. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు ఆశా వర్కర్‌ను కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళా కార్యకర్తలతో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా.? అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement