న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటించిన ఎన్నికల హామీలన్నీ బోగస్ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, బీఆర్ఎస్ గత హామీలనే అమలు చేయలేదని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన బీఆర్ఎస్‌కు ఎన్నికల హామీలు ఇచ్చే హక్కు కోల్పోయిందని అన్నారు.
దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 2 ఎకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, దళిత బంధు, బీసీ బంధు, రైతు రుణమాఫీ హామీలేవీ అమలు చేయలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు కొత్తగా ఇస్తున్న హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదని జవడేకర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని అన్నారు.