హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహిస్తున్న భారత్ జోడో పాదయాత్రలో రాబోయే మూడు రోజులు అత్యంత కీలకమని టీ పీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 5,6 తేదీలలో మాత్రమే రాహుల్ పాదయాత్ర కొనసాగుతుందనీ, 7న వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్, ఏఐసిసి నేత బోసు రాజు, షబ్బీర్ అలీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలోని మక్తల్‌లో ప్రవేశించినప్పటి నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చిందనీ, అయినా యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈనెల 5,6న మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందనీ, 5న సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుందనీ, 7న వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
అదే రోజు భారీ బహిరంగ భ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదన్నారు. ఈనెల 7న రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందనీ, రాత్రి 9-30 గంటలకు దెగ్లూరులో మహారాష్ట్ర నేతలకు పరిచయం చేయబోతున్నామని చెప్పారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపే బహిరంగ సభ నిర్వహించుకోవాలనీ, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల నాయకులు ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పారు. రాహుల్ యాత్ర కవరేజి కాకుండా కుట్రలు చేసినప్పటికీ మీడియా మంచి కవరేజి ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో జర్నలిస్టులకు కూడా చాలా అన్యాయం జరిగిందనీ, జర్నలిస్టు సంఘాల నాయకులకు కూడా రాహుల్‌తో ప్రత్యేక సమయం కల్పిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.