అమరావతి, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఎం.శేషగిరిబాబు మంగళవారం విడుదల చేశారు. వీరిలో మొదటి సంవత్సరం తప్పిన వారిలో 1,50,313 మంది పరీక్ష రాయగా 37.77 శాతం మంది పాసవ్వగా రెండో సంవత్సరం తప్పిన వాళ్లలో1,01,340 పరీక్ష రాయగా 42.36 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది కాకుండా ఎప్పటి నుండో ఇంటర్ తప్పిన విద్యార్ధులు ప్రయివేట్ అభ్యర్దులుగా 38,666 మంది పరీక్ష రాయగా 37 శాతం మంది పాసయ్యారు.
ఇంప్రూమెంట్ కోసం 1,69,347 మంది రాయగా 83.69 శాతం మంది పాసయ్యారు. మొత్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కలిపి చూస్తే మొదటి సంవత్సరంలో 77.54 శాతం, రెండో ఏడాదిలో 84.35 శాతం మంది పాసయ్యారు. మొత్తంగా చూసినా బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 80.56 శాతం పాసవ్వగా… బాలురు 74.34 శాతం మాత్రమే పాసయ్యారు.
రెండో ఏడాదిలో బాలికలు 86.46 శాతం మంది పాసవ్వగా…బాలురు 81.99 శాతం మంది మాత్రమే పాసయ్యారు. సెకండరియర్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా అత్యధికంగా 97.32 శాతం ఉత్తీర్ణత సాధించగా, కడప జి ల్లా అత్యంత తక్కువగా 75.95 శాతం ఉత్తీర్ణత సాధించింది. కాగా పరీక్ష ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈనెల 23వ తేదీలోగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని శేషగిరిబాబు తెలిపారు.