ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలైన ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్.. కెనడాకు చెందిన కేథరిన్ చోయ్, జోసెఫిన్ వుపై వరుస గేమ్‌లతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
ఇవ్వాల (మంగళవారం) జరిగిన మ్యాచ్ లో రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరుకున్న ట్రీసా, గాయత్రి.. ప్రపంచ 29వ ర్యాంకర్ కెనడా జంటపై 21-16 21-17 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ఇక, రెండో రౌండ్ లో ప్రపంచ నంబర్ 4 లో ఉన్న జపనీస్ జోడీ మయు మట్సుమోటో-వకానా నగహారాతో వీరిద్దరూ కఠినమైన మ్యాచ్ లో ఎదుర్కొంటారు.
నాలుగేళ్ల తర్వాత టోర్నీ ఆడుతున్న అశ్విని పొన్నప్ప.. తన మహిళల డబుల్స్ భాగస్వామి తనీషా క్రాస్టోతో కలిసి బరిలోకి దిగగా.. ఓపెనింగ్ రౌండ్ లో ఇండోనేషియా జంట ఫెబ్రియానా ద్విపూజి కుసుమ-అమాల్లియా కహయా చేతిలో 11-21 21-14 17-21తో ఓడిపోయింది.
మరో మహిళల డబుల్స్‌లో ఎన్.సిక్కి రెడ్డి, ఆరతి సారా సునీల్ జోడీ కూడా… వారి ఓపెనింగ్ రౌండ్ లో తైవాన్ జంట హ్సు యిన్-హుయ్ చేతిలో 14-21 17-21తో ఓడిపోయింది.
ఇక.. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు జరిగే చివరి ఈవెంట్ అయిన ఈ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పోటీపడే స్టార్ భారత ఆటగాళ్లలో పివి సింధు, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఉన్నారు.