Saturday, November 23, 2024

TG | మొహర్రంకు ఎలాంటి అసౌకర్యాలు ఉండవు : మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మొహర్రం పవిత్ర మాసంలో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆషుర్‌ ఖానాల వద్ద పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆషుర్‌ ఖానాల పరిసర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజ్‌, రోడ్లు మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అలాగే అన్ని చోట్ల హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

మొహర్రం పదో తేదీన ఏనుగుపై కొనసాగే బీబీ ఫాతిమా ఆలం ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విద్యుత్‌ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని, వాటర్‌ బోర్డ్‌ అధికారులు త్రాగు నీరు అందించాలని, జీ.హెచ్‌.యం.సీ అధికారులు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. మొబైల్‌ టాయిలెట్లు తదితర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -

ప్రధాన ఊరేగింపు ప్రారంభం కానున్న బీబీకా ఆలం పరిసరాల్లో పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సంతాపం తెలిపేందుకు ఆషుర్‌ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బంధులు కలగకుండా అన్ని మౌళిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ సూచించారు. వారి కోసం మినీ బస్సులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను కూడా అందుబాటులోకి ఉంచాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement