న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాల్సిందేనని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో ఆ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు రాజ్యసభలో నోటీసులిస్తూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న అంశంపై చర్చ జరపాలని కోరారు. లోక్‌సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. సభలోపల ప్రతిపక్షాలతో పాటు గళం కలుపుతూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని తప్పుబట్టారు. ఉభయ సభలు మధ్యాహ్నం గం. 2.00 వరకు వాయిదా పడడంతో పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మద్ధతిస్తూ వారితో పాటు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల విజయ్ చౌక్ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని మాట్లాడారు.
దర్యాప్తు సంస్థలే కాదు, గవర్నర్ల వ్యవస్థ సైతం దుర్వినియోగం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అన్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగాలని ఆయనన్నారు. సీబీఐ, ఈడీ సహా దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారం పనిచేయాలి తప్ప పాలకుల ఆదేశాల ప్రకారం కాదని హితవు పలికారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును బీజేపీ కావాలని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నిజానికి దర్యాప్తు జరపాల్సింది అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై అని ఆయనన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటుచేసిందని, అదానితో మోదీకి ఉన్న సంబంధాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై చర్చ జరగకుండా చేయడం కోసమే బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రతిపక్షాలు కలసికట్టుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
సమాధానం చెబితే గోలే ఉండదు కదా!
అదానీ-హిండెన్‌బర్గ్ అంశం.. అదానీ గ్రూపు సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల రుణాల గురించి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెబితే ప్రతిపక్షాలు గోల చేసే అవకాశమే ఉండదని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ప్రారంభమవడానికి ముందే మీడియాతో మాట్లాడిన ఆయన, తొలివిడత బడ్జెట్ సమావేశాల నుంచి ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తున్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వమే వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభను అడ్డుకున్న బీజేపీ, ఇప్పుడు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
మోడీది కక్షసాధింపే
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కక్ష సాధిస్తున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదని అన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు అభియోగాలు మోపారని విమర్శించారు. ఇదంతా కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.