ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : అధికారం లేదని, అహంకారంతో దాడులకు పాల్పడుతున్నారని భయపడాల్సిన పనిలేదని, భవిష్యత్ మనదేనని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని సాయి కన్వెన్షన్ లో నిర్వహించిన నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటమి శాశ్వతం కాదని, అది భవిష్యత్ గెలుపుకు నాంది అన్నారు.
జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నల్గొండ జిల్లా కు తీవ్ర నష్టం జరుగుతుందని, సాగు, తాగు నీళ్లు దొరకవని, త్వరలో కరువు విలయతాండవం చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడి పాలనలో అసహనం వ్యక్తం చేస్తూ చేతగాని దద్దమ్మలుగా చరిత్రలో మిగిలిపోతారని తెలిపారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని దుష్ప్రచారం చేసిందని, బండి సంజయ్, రఘునందన్ రావ్, ఈటెల రాజేందర్ లను ఓడించింది బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తులు పెట్టుకుందన్నారు. రైతుబంధు, రుణమాఫీ, పింఛన్, కరంట్, బోనస్, ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని జడ్పి చైర్మెన్ సందీప్ రెడ్డి అడిగితే విచక్షణ కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులతో బయటకు పంపించడం అహంకారానికి నిదర్శనమన్నారు.
రైతుబంధు పడడం లేదని అడిగితే చెప్పుతో కొట్టండి అనడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ చెసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చిందన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమయ్యింది. రూ. 4 వేల పింఛన్ ఏమయ్యింది..420 గాళ్లు చెప్పిన 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీలని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ 420 హామీలను గ్రామాల్లో, తండాల్లో చర్చ పెట్టాలన్నారు. 8నెలలు కాకముందే కర్ణాటకలో కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారు.
అక్కడ 25 ఎంపీ సీట్లలో కేవలం 4మాత్రమే వస్తాయంటున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేసాం. ప్రతిపక్షములో ఉన్నప్పుడు ప్రజల కోసం కొట్లాడుదాం అని పిలుపునిచ్చారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనేనని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి భువనగిరి ఖిల్లా పై గులాబీ జెండాను ఎగరేయాలన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర,జడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, భారాస రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డిలు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు అమరేందర్, రాజవర్ధన్ రెడ్డి, జక్క రాఘవేందర్ రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, జనగాం పాండు, శ్రీనివాస్ రెడ్డి, ఓం ప్రకాష్ గౌడ్, మమతా రెడ్డి, లావణ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.