న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పోలవరం, అమరావతికి నడుం కడితే జగన్ అధికారంలోకి వచ్చాక రెండింటినీ నాశనం చేశారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ర్ట విభజన జరిగాక 2029 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా పునాదులు వేసేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు శనివారం ఆయన ఢిల్లీ వచ్చిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో టీడీపీ ఎంపీలు, నేతలతో కలిసి ఆమె నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నాక సుదీర్ఘ కాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఎదురుపడి సంభాషించుకున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి హాజరైన కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురితో చంద్రబాబు ముచ్చటించారు.
జాతీయ మీడియాతో చంద్రబాబు భేటీ
ప్రధానితో సమావేశం అనంతరం కొందరు జాతీయ మీడియా ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు నాయుడుణ్ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులతో పాటు పలువురు జాతీయ మీడియా, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు, దేశంలోని పరిణామాలపై జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా వున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. ప్రజల నాడి అర్థం కావడంతో జగన్ ప్రస్తుతం ప్రస్టేషన్‌లో ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌కు అభివృద్ధి ధ్యాస లేదని చంద్రబాబు మండిప్డారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కుప్పకూలిందని, మొత్తం వ్యవస్థలను జగన్ నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పాలనాపరంగా జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులు అత్యంత దారుణంగా వున్నాయన్నారు. అప్పులు తప్ప అభివృద్ధి లేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏ వర్గం ప్రజానీకమూ సంతోషంగా లేదని వివరించారు. కోవిడ్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం సహా అనేక విపత్తులు ఎదురైనా అనేక దేశాలతో పోలిస్తే భారత్ తట్టుకుని నిలబడగలిగిందని హర్షం వ్యక్తం చేశారు. యూరప్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడిందని వెల్లడించారు. అనేక దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రజల తలసరి ఆదాయం ఎక్కువగా వుందని చంద్రబాబు వివరించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.
చర్చనీయాంశమైన కేసినేని నాని ప్రవర్తన
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలలో కేసినేని నాని వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఇవ్వవలసినదిగా ఎంపీ గల్లా జయదేవ్ పుష్పగుచ్చాన్ని కేసినేని నాని చేతికి అందించబోగా ఆయన దానిని కోపంగా నెట్టివేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాని ఎయిర్‌పోర్టులో ఏకంగా అధినేత ఎదుటే వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.