న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 15,970 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు రూ. 13,226 కోట్ల మేర చెల్లింపు జరిగిందని వివరించారు.
పోలవరం ప్రాజెక్ట్ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే ఆఫీసు మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి ఇరిగేషన్ కాంపోనెంట్ కింద అయిన ఖర్చును మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ ఖర్చును సమయానుసారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.