న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కుక్కలకు, నక్కలకు లెక్కలున్నాయి గానీ బీసీలకు లేవని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పులుల లెక్కలు సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీసీల లెక్కలు ఎందుకు సేకరించదని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ధర్నాలో పెద్దసంఖ్యలో వెనుకబడిన వర్గాల వారితో పాటు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా నుంచి వచ్చిన బీసీలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా గణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు పార్లమెంటును ముట్టడించారు. పార్లమెంట్ వైపుకు దూసుకువస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్లు పెట్టి నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఎనగాల నూకాలమ్మ, తెలంగాణకు చెందిన శ్రీనివాస్ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోకపోతే తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో వాటా కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిథ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా వెల్లడైందన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి చేసి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రీమి లేయర్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు.
కులాల వారీగా జనగణన, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లతో రిజర్వేషన్లు తదితర డిమాండ్లకు బీద మస్తాన్‌రావు మద్దతు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఆన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని మస్తాన్‌రావు కొనియాడారు. బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కల సేకరించాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ తరహాలో జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.