Saturday, November 23, 2024

టీసీఎస్‌లో లే ఆఫ్స్‌ లేనట్లే! హెచ్‌ఆర్‌ చీఫ్‌ మిలింద్‌ సానుకూల వ్యాఖ్యలు

టెక్‌ ఉద్యోగుల్లో లే ఆఫ్స్‌ భయాలు నెలకొన్న నేపథ్యంలో, టెక్‌ దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపు అంశాన్ని పరిగణించడం లేదని టీసీఎస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. లే ఆఫ్‌లు లేదా అసంకల్పిత అట్రిషన్‌ గురించి అడిగిన ప్రశ్నకు టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ సావధానంగా జవాబిచ్చారు. ఒక ఉద్యోగిని తీసుకున్న తర్వాత సుదీర్ఘ కెరీర్‌ కోసం ప్రతిభను పెంచుకోవాలనే నమ్మకంతో ఉన్నాం. కాబట్టి తొలగింపులకు ప్రాధాన్యం ఇవ్వం. స్టార్టప్‌ ఉద్యోగులను కూడా నియమించుకోవడంపై ఆలోచిస్తున్నాం అని మిలింద్‌ లక్కడ్‌ చెప్పారు. ప్రపపంచ వ్యాప్తంగా పెద్ద టెక్‌ సంస్థలు సహా ఐటీ కంపెనీలు అనేక కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

శిక్షణతో సామర్థ్యం పెంపు..

చాలా కంపెనీలు వారికి అవసరమైన దానికంటే ఎక్కువ మందిని నియమించుకున్నాయి. అందువల్ల మాంద్యం భయాలతో జాగ్రత్త పడుతున్నాయి. అదనపు సిబ్బందిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, మొదటి నుంచీ జాగ్రత్తగా ఉన్న టీసీఎస్‌, ఉద్యోగి నియామకం తర్వాత అతనిని ఉత్పాదకత శక్తిగా మార్చుకోవడాన్ని బాధ్యతగా తీసుకుంటుంది. అవసరమైన నైపుణ్యాలు, ఉద్యోగి సామర్థ్యం మధ్య అంతరం ఉన్నట్లు గుర్తిస్తే, ఉద్యోగికి శిక్షణ ఇవ్వడంపై దృష్టిసారిస్తాం అని లక్కాడ్‌ వివరించారు. 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్న తమసంస్థ మునుపటి మాదిరిగానే ఉద్యోగుల నియామకాల పెంపును కొనసాగిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ వంటి రంగాలలో స్టార్టప్‌లు అనేక మందిని తొలగిస్తున్నందున, అటువంటి ప్రభావిత వ్యక్తులను తమ సంస్థలోకి తీసుకునే విషయంపై ఆలోచన చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

విస్తృత అవకాశాల వేదిక…

టెక్‌రంగం చాలా పెద్ద వేదిక. మేము విభిన్న సాంకేతికతలలో వివిధపరిశ్రమలలో ఉత్తేజకరమైన ప్రాజెక్టులు చేస్తున్నాం. వీటన్నింటిలో రాణించడానికి కొంత అద్భుతమైన ప్రతిభ అవసరం. స్టార్టప్‌ల ద్వారా ఆ ప్రతిభను పొందాలని భావిస్తున్నాం. వాస్తావనికి ఆ కంపెనీలలో కొందరు ప్రతిభావంతులు స్వల్పకాలిక కెరీర్‌ సవాళ్లను కలిగివున్నారు. అదే సమయంలో మేము యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌, డిజైన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌లోని అనేక అంశాలు, ప్రొడక్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో ప్రతిభ కోసం అన్వేషిస్తున్నాం అని మిలింద్‌ లక్కాడ్‌ చెప్పారు.

నియామకాల్లో వేగం తగ్గొచ్చు..

డిసెంబర్‌ త్రైమాసికంలో 2000 మంది సిబ్బంది తొలగింపు తర్వాత, ఇదే పరిస్థితి మార్చి త్రైమాసికంలో కొనసాగుతుందా అన్న ప్రశ్నకు నేరుగా జవాబివ్వలేదు. కానీ, గతేడాది 1.19 లక్షల మంది ట్రైనీలతో సహా 2 లక్షల మందిని నియమించుకున్నామని, వారు ఇప్పటికే ముగింపు దశలో ఉన్న ప్రాజెక్టుల్లో ఉన్నందున, కొత్త నియామకాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 40వేల మందికిపైగా ట్రైనీలను తీసుకోనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా యూఎస్‌ టెక్‌ దిగ్గజ సంస్థల్లో తొలగింపునకు గురైనవారు, వీసా షరతులతో ఇండియాకు తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్న వారిని అమెరికాలోని తమ సంస్థల్లో నియమించేందుకు ఆసక్తిగా ఉన్నామని అన్నారు.

భారతీయ నిపుణులకు అవకాశాలు..

ప్రస్తుతం యూఎస్‌ ఉద్యోగుల్లో 70శాతం మంది అక్కడివారే. భారత్‌లోని నిపుణులకు ప్రపంచ వ్యాప్త అవకాశాలు పెంచాలని చూస్తున్నందున, అమెరికన్‌ ఉద్యోగుల శాతాన్ని 50కి తగ్గిస్తామని చెప్పారు. ఆదాయపరంగా అతిపెద్ద మార్కెట్‌ అయిన యూఎస్‌లో బిజినెస్‌, హెచ్‌-1 వీసాల కోసం త్వరిత నియామకాలు, క్లియరెన్స్‌లు అవసరమని లక్కాడ్‌ పేర్కొన్నారు. మూన్‌లైటింగ్‌పైనా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 40శాతం మంది సిబ్బంది వారానికి మూడుసార్లు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారని, 60 శాతం మంది వారంలో రెండురోజులు ఆఫీసుకు వస్తుంటారని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలను తగ్గిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement