Friday, November 22, 2024

అటు కొవిడ్‌ కేసులు, ఇటు నిరసనలు.. చైనాలో అదుపు తప్పుతున్న పరిస్థితులు

జీరో కొవిడ్‌ పాలసీ చైనాలో బెడిసికొట్టింది. కఠిన ఆంక్షలు వైరస్‌ను కట్టడి చేయలేక పోగా, ప్రజల్లో అసహనం పెల్లుబికేలా చేసింది. ఈ ఆంక్షలు ఇక వద్దంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇంకొకవైపు రోజుకు 40 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితులు కమ్యూనిస్టు ప్రభుత్వానికి సంకటంగా మారాయి. తాజాగా వరుసగా ఐదో రోజు చైనాలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్‌ వెల్లడించింది. అందులో 3,822 కేసులు వైరస్‌ లక్షణాలతో ఉన్నట్లు తెలిపింది. 36,525 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఇక చైనాలో 3,11,624 కొవిడ్‌ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు కొత్త కరోనా ఇన్ఫెక్షన్‌ కారణంగా 5,232 మంది చనిపోయారు. ‘జీరో కొవిడ్‌’ పాలసీని అమలు చేస్తూ లక్షల మంది ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో వేల మంది చైనీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ను అంతం చేయాలని నినాదాలు చేశారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఖాళీ కాగితాలు, రాత్రిపూట మొబైల్‌ ఫోన్ల ప్లnాష్‌లైట్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా నెటిజన్లు సైతం ఖాళీ కాగితాల చిత్రాలను పోస్టులుగా పెడుతున్నారు. ఆందోళనకారులకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement