Saturday, November 23, 2024

కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీ.. 10 లక్షల విలువ చేసే కాపర్ బండిళ్లు మాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌రూంలో భారీ చోరీ జరిగింది. దీంతో కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో నిఘా వైఫల్యం బయటపడింది. కంట్రోల్‌ రూంలో వేర్వేరు పనుల నిమిత్తం కొన్నాళ్ల క్రితం కాంట్రాక్టర్‌ కాపర్‌ వైర్‌ బెండళ్ళను ఉంచారు. ఇందులో నుంచి దాదాపు రూ.10 లక్షల విలువ చేసే 38 బండళ్ళు చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి సంబంధించి ప్రాజెక్టు మేనేజర్‌ సురేష్‌ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీకి పాల్పడింది అందులో పని చేసే వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని వివరాలను కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. అందులోనే పని చేసే కార్మికుడు ఒకరు కాపర్‌ బండిల్స్‌ను అధిక ధరకు విక్రయించాడని గుర్తించారు. అయితే ఈ చోరీ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో తెలిసేలా ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూంను ప్రభుత్వం నిర్మిస్తోంది. భవన నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో వైరింగ్‌ తదితర పనులు జరుగుతున్నాయి. వైరింగ్‌ పనుల నేపథ్యంలోనే కాంట్రాక్టర్‌ కాపర్‌ వైర్‌ బండిళ్ళను నిలువ చేశారని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement