Wednesday, November 20, 2024

Big Story | గుండె పగిలింది, నమ్మకం సడలింది.. పరీక్షాపత్రాల లీకేజీపై యువత అసహనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి : తెలంగాణ కోసం తెగించి కొట్లాడిందే ప్రధానంగా యువత, విద్యార్థులు ఉద్యోగాల కోసం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందే ప్రధానంగా ఉద్యోగకాంక్ష. ఆలస్యమైనా నోటిఫికేషన్లు వచ్చాయని.. చదువులో మునిగిపోయిన విద్యార్థులకు, ఏజ్‌ బార్‌ అయినా తల్లితండ్రుల కోరిక తీర్చేందుకు అప్పులు.. బాధలు దిగమింగి ఏళ్ళకుఏళ్ళుగా హాస్టళ్ళలో మగ్గుతున్న విద్యార్థులకు ఇపుడు భరోసా ఎవరు? ఒకటా.. రెండా వరుస పేపర్ల లీకేజీలు. తెరవెనుక కథలు.. అన్నీ విద్యార్థుల గుండెలు బద్దలు చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవ#హరించిన వ్యవస్థపై, పర్యవేక్షణా లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరీక్షకు ప్రిపేరయ్యే విద్యార్థి కష్టం వెనుక ఎంతోమంది ఆశలు ఉంటాయి.

అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లించిన విద్యార్థులు.. ఈ సారి నోటిఫికేషన్లలో జాబ్‌ కొట్టి.. సెటిలవ్వాలని, తల్లితండ్రుల కష్టం తీర్చాలని శక్తికి మించి పనిచేసిన విద్యార్థుల హృదయాలు లీకేజీలతో ముక్కలయ్యాయి. కుటుంబపోషణ భారంగా మారినా.. నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు రాసిన విద్యార్థులు లీకేజీ షాక్‌తో అంతర్మథనంలో కూరుకుపోయారు. ఎక్కువ నోటిఫికేషన్లు రావడంతో.. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ విభాగం నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను దొంగిలించి, లక్షల రూపాయలకు ఆ పేపర్లను అమ్ముకోవడం.. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను బజారున పడేసింది. వారి జీవితాలను అంధకారం చేసింది.

- Advertisement -

నమ్మకం కలిగించాలి..

పేపర్ల లీకేజీలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పరీక్షలు రాసిన వారు, పరీక్షలకు దరఖాస్తు చేసిన వారే కాదు.. ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలు ఏమలుపులు తీసుకుంటాయోనన్న గుబులు అధికార పార్టీ నేతల్లో నెలకొంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ విద్యార్థులకు భరోసానిచ్చే యత్నం చేశారు. పరీక్ష ఫీజులు ఉండవని, త్వరగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు లీకేజీ వ్యవహారం విపక్షాల ఆందోళనల కంటే ప్రజల్లోకి బాగా వెళ్ళింది. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహణాలోపాలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అధికారులపై తీవ్రంగా స్పందించారు.

ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవహారంపై అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించిందన్న అంశం విస్మయపరుస్తోంది. లీకేజీలు, డబ్బులు చేతులు మారిన వ్యవహారం, హనీట్రాప్‌, పోర్న్‌ వీడియోలు.. పరీక్షా వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయి. యువత భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల్లో ఇన్ని.. చిల్లరపనులు చోటుచేసుకోవడం విస్మయపరిచే అంశం. ఇపుడు విద్యార్ధులకు, తల్లితండ్రులకు భరోసానిచ్చే నిర్ణయాలు రావాలని అపుడు మాత్రమే మండుతున్న హృదయాలకు కొంత ఉపశమనం లభిస్తుందన్న చర్చ ఉంది. ప్రభుత్వానికి ఇది సవాలే.

మానవీయ సీఎం..

సమస్య ఏదైనా మానవీయ కోణంలో స్పందించి భరోసా ఇచ్చే నేత కేసీఆర్‌. అనేక సంక్షోభాలు, సమయాల్లో కేసీఆర్‌ తన స్పందనతో, ఒక్క పిలుపుతో పరిస్థితులు మార్చివేశారు. లీకేజీ కారణంగా లక్షల నిరుద్యోగ కుటుంబాల్లో ఆందోళన, ఆవేదన నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా స్పందిస్తే లక్షలాదిమందికి భరోసా దొరుకుతుందన్న చర్చ బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ నెలకొంది. మండుతున్న లక్షలాది గుండెలకు ఓదార్పు, ధైర్యంగా ఏదైనా చెప్పాలని పలువురు ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. తెలంగాణ సమాజానికి, కేసీఆర్‌కు ఉన్న అనిర్వచనీయ అనుబంధం కారణంగా, సమస్య మూలాలను ప్రజలు అర్థం చేసుకుంటారన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. సీఎం స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎన్నో లోపాలు..

ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం, టీఎస్‌పీఎస్సీలో సరిపోయిన సిబ్బంది లేకపోవడం ఈ లీకేజీ పాపానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిదేండ్ల కాలంలో 155 నోటిఫికేషన్ల ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ ఈ ఒక్క ఏడాదే వరుసగా 26 నోటిఫికేషన్లు జారీ చేసి, 25 వేల ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇందులో గ్రూప్‌-1, 2, 3, 4 వంటి ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులకు సంబంధించిన పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పోటీ ప్రపంచాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన కొందరు.. అక్రమ మార్గాలను ఎంచుకోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌ విభాగం నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను దొంగిలించి, లక్షల రూపాయలకు ఆ పేపర్లను అమ్ముకోవడం.. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను బజారున పడేసింది. వారి జీవితాలను అంధకారం చేసింది. నిరుద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశమే ఉంటే.. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి, నియామకాలు చేపట్టొచ్చు కదా.. ఒకేసారి ప్రకటనే దీనికి కారణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

టీఎస్‌పీఎస్సీలో సిబ్బంది ఏరీ?

టీఎస్‌పీఎస్సీలో సరిపోయిన సిబ్బంది లేకపోవడం కూడా పేపర్‌ లీకేజీకి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో 83 మంది మాత్రమే రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. మిగతా ఉద్యోగులంతా కాంట్రాక్ట్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే. ఒక్క ఏడాదిలో అత్యధికంగా 2 వేల నుంచి 3 వేల వరకు పోస్టులను భర్తీ చేసిన రికార్డు టీఎస్‌పీఎస్సీకి ఉంది. కానీ ఈ ఏడాది ఏకంగా 23వేల పోస్టులను భర్తీ చేయాల్సి రావడంతో టీఎస్‌పీఎస్సీపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇందులో గ్రూపు-1, 2, 3, 4 వంటి ముఖ్యమైన పోస్టులూ ఉన్నాయి.

దాంతో కమిషన్‌ చైర్మన్‌తోపాటు ఇతర సిబ్బందిపైనా ఒత్తిడి పడింది. ఇలా ప్రభుత్వ యంత్రాంగ తప్పిదాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో సర్కార్‌ కొలువు కొట్టడం కష్టమని భావించిన కొందరు అడ్డదారులు తొక్కి లక్షలాది మంది నిరుద్యోగులను జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసి.. లక్షల రూపాయలకు అమ్ముకొని డబ్బు సంపాదించాలనుకున్న దుర్మార్గులకు తమ శాపం తగులుతుందని నిరుద్యోగ కుటుంబాలు గుండెలు మండి శపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement