ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్‌గ్వెమా ఎంబసోగో తాజాగా జరిగిన రీ ఎలక్షన్‌లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది ఆరోసారి. ఫలితంగా నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ప్రధానిగా ఒబియంగ్ రికార్డులకెక్కారు. 80 ఏళ్ల ఒబియంగ్ 95 శాతం ఓట్లు అంటే దాదాపు 4,05,910 ఓట్లతో విజయం సాధించారు. ఒబియంగ్ మరో ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగుతారని ఎలక్టోరల్ కమిషన్ హెడ్ ఫాస్టినో ఎన్‌డోంగ్ ఎసోనో ఐయాంగ్ తెలిపారు. ఈ ఎన్నికలో 98 శాతం ఓట్లు పోలైనట్టు చెప్పారు. 1.5 మిలియన్ల జనాభా కలిగిన ఈ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీలో చమురు పుష్కలంగా లభిస్తుంది.
ఇప్పటికై బలమైన పాలకుడిగా పేరు సంపాదించుకున్న ఒబియంగ్ మరోమారు విజయం సాధించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలిస్తున్న అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. అధికార డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా, సంకీర్ణ కూటమి కలిసి సెనేట్‌లో 55 స్థానాలు, దిగువ సభ అయిన చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో 100 స్థానాలు గెలుచుకున్నట్టు ఉపాధ్యక్షుడు తెలిపారు. ఒబియంగ్ 1979లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పలు మిలటరీ తిరుగుబాట్ల నుంచి ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు.