Friday, November 22, 2024

Big Story: సంక్షేమంలో మూడింతలకు చేరిన వ్యయం.. దేశంలోనే భారీ కేటాయింపులతో రికార్డు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లలు దాటుతున్నాయి. అణగారిన, నిమ్న వర్గాలు, అన్ని నిరుపేద వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిధుల్లో వాటా పెంచుతూ సంక్షేమ పథకాలతో ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తోంది. సకల వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సరికొత్త పథకాలను అమలు చేస్తూ ఎనిమిదేళ్ల పాలనలో ఉత్తమ లక్ష్యాలను చేరుకున్నది. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపుల శాతం మూడింతలకు పెరిగింది. 2014-15 తొలి ఏడాదిలో సంక్షేమరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో రూ. 24,424కోట్లు కేటాయించగా, గతేడాది నాటికి రూ. 98,425 కోట్లకు చేరుకున్నది. ఈ కేటాయింపులు క్రమంగా పెరుగుతూ ఇంతింతై అన్నట్లుగా పెరుగుతూ వచ్చిన నిధులు ఆయా వర్గాల్లో కొండంత విశ్వాసం నింపాయి.

కేటాయింపులు చేయడమే కాకుండా ఖర్చు చేయడంలో కూడా తెలంగాణ సర్కార్‌ రికార్డులు సృష్టించింది. 2015-16లో రూ. 42,510కోట్లు, 2016-17 ఏడాదిలో రూ. 47,949కోట్లు, 2017-18లో రూ. 50,204కోట్లు, 2018-19లో రూ. 56,887కోట్లు, 2019-20లో రూ. 57,910కోట్లు, 2020-21లో రూ. 70,078కోట్లు, 2021-22 ఏడాదిలో రూ. 98,425కోట్లను కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నది. ప్రతీ బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ప్రభుత్వం నిధులను వెచ్చించడమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించింది. అనేక పథకాలకు రూపకల్పన చేసి వాటి అమలుతో సంపదను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచుకోవడంలో విజయవంతమైంది.

- Advertisement -

అభివృద్ధికి కేరాఫ్‌గా, నమూనాగా చెప్పుకునే ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా సంక్షేమానికి ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరగలేదు. 2014-15లో గమనిస్తే గుజరాత్‌ సంక్షేమరంగానికి రూ. 47,259కోట్లను, 2021-22లో రూ. 81వేలకోట్లను కేటాయించింది. కర్నాటకలో ఈ నిధులు 2014-15లో రూ. 51,509కోట్లుకాగా, 2021-22లో రూ. 92,038కోట్లుగా ఉంది. తమిళనాడులో రూ. 62,758కోట్లనుంచి రూ. 1,23,029కోట్లకు కొంతమేర పెరుగుదల నమోదు చేసుకుంది. అయితే జనాభా పరంగా ఆయా రాష్ట్రాలు తెలంగాణకంటే ఎక్కువ కావడం, నిధుల కేటాయింపుల్లో తక్కువ కావడం వారి నిబద్దతకు నిలువుటద్దంగా నిలుస్తోంది.

ఇలా ఒక్కో పథకానికి, గతంలో హామీ ఇవ్వకుండా అప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పథకాలకు ఆర్ధిక శాఖ నిధుల సమన్వయం చేస్తోంది. తాజాగా యాసంగి రైతుబంధు వచ్చే నెలలో ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నది. ఇక ప్రతీ నియోజకవర్గానికి 1500మందికి దళితబంధుపై నిధుల సమీకరణ వేగం పెంచారు. సొంత స్థలం ఉన్న పేదలకు సొంతింటికి రూ. 3లక్షల అందజేతకు కూడా కార్యాచరణ జరుగుతోంది. ఇక చివరి త్రైమాసికానికి చేరడంతో రాష్ట్ర రాబడిపై కీలక ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మాత్రం ఢోకా లేకుండా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో సహజంగానే మరికొన్ని కొత్త పథకాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పుడున్న పథకాల ఖర్చు, సబ్సిడీలు, జీతాలు, పింఛన్లు, ఉద్యోగులకు ఇతర వరాలు, పాత పెన్షన్‌ విధానం వంటి పలు అంశాలపై ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలే కాదు, సంక్షేమానికి ఏ రాష్ట్రం ఖర్చు చేయనిరీతిలో నిధులను వెచ్చించి సంక్షేమ సర్కార్‌గా తెలంగాణ జాతీయ స్థాయిలో ఖ్యాతిని సొంతం చేసుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ కేటాయింపులు మరింత పెరుగుతాయని ఆర్ధిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement