Saturday, November 23, 2024

పెళ్లిళ్ల జోరు! ఆలయాలు, ఫంక్షన్‌ హాళ్లన్నీ హౌస్‌ఫుల్‌..

అమరావతి, ప్రభన్యూస్ : శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. నామమాత్రంగానే వివాహాలు చేసుకున్నారు కొందరు. అయితే కోవిడ్‌ ఆంక్షల సడలింపు, మరోవైపు శుభముహూర్తాలు అధికంగా ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వందలాది జంటలు ఒక్కటవుతున్నాయి. జూన్‌ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం ఉంది. భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తికమాసాల్లో (ఆగస్టు 23 నుంచి నవంబర్‌ 27 వరకు శుక్ర మౌఢ్యమి(మూఢం) కావడంతో మరో నాలుగు నెలలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం రానుంది. పెళ్లిళ్లే కాకుండా ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠ మహోత్సవాలు, అన్ని రకాల శుభకార్యాలకు జూన్‌ 23 వరకు అనువైన మంచి శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 13,14,15,16 తేదీల్లో వేలాది మందికి వివాహాలయ్యాయి.

పెళ్లిళ్లపై కరోనా ప్రభావం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్‌లో వేలాదిగా వివాహాలవుతుంటాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లలో నామమాత్రం సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. 2020లో కోవిడ్‌ ఆంక్షలకు కొంత మేర సడలింపులు ఇవ్వడం, నిర్దిష్టమైన సంఖ్యలో వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో 2021లో వివాహాల సంఖ్య కొంతమేర పెరిగింది. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలగించడంతో ఆసంఖ్య మరింతగా పెరిగింది. రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో దాదాపు 50 వేలకుపైగానే జంటలు ఒక్కటి కానున్నాయి.

శుభకార్యాలతో వందల మందికి ఉపాధి..

పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కల్యాణ మంటపాలు, కేటరింగ్‌, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్‌ కార్లు, బస్సులు, ఐస్‌క్రీమ్‌, మినరల్‌ వాటర్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు, పూలు, డెకరేషన్‌, లైటింగ్‌, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది. ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ ముందస్తు బుకింగ్‌లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని వేలాది మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. రెండేళ్ల నుంచి అంతంతమాత్రంగా శుభ కార్యాలు చేశారు. ఇప్పుడు వరుస ఫంక్షన్లు రావడంతో అన్నీ రకాల వాళ్లకు ఉపాధి చేకూరిందని చెప్పొచ్చు.

- Advertisement -

జూన్‌ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే..

ఈ నెల 21, 22, 24 తేదీలు
మే నెలలో తేదీలు: 3, 4, 12, 14, 18, 20, 21, 22, 25
జూన్‌లో తేదీలు: 1, 3, 5, 6, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23
ఇతర శుభ ముహూర్తాలు
మేలో 4 నుంచి 9వ తేదీ వరకు, 11 నుంచి 15 వరకు, తిరిగి 18, 20, 21, 22, 23, 25 తేదీల్లో ఇతర శుభ ముహూర్తాలు ఉన్నాయి.
జూన్‌లో 1 నుంచి ఆరోతేదీ వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు, 13, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీలు ఇతర శుభముహూర్తాలున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement