పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమ్మ లాంటి అంగన్ వాడి కేంద్రాలను ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు దూరం చేస్తోందని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల అంగన్ వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అచంట సునీత నియమితులై సందర్భంగా చంద్రబాబును కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా సునీత అంగన్ వాడి కేంద్రాలపై ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపూరిత ఆలోచనను చంద్రబాబుకు వివరించారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ అంగన్ వాడి కేంద్రాల్లో ఆరు రకాల సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న వాటిని ప్రాధమిక పాఠశాలల్లో కలపటం దుర్మార్గమన్నారు. ఇంకా ఏమన్నారంటే… ‘‘అంగన్ వాడి కేంద్రాలు గ్రామాల్లో గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు దగ్గరగా ఉండటంతో సులువుగా వచ్చి వెళుతూ సేవలు ఉపయోగించుకుంటున్నారు.
నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సేవలు వాడుకుంటున్న వారంతా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండదు. అంగన్ వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయాలనుకునే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబును కలిసిన వారిలో ముల్పూరి కళ్యాణి, ప్రవీణా, అనబత్తిన జయలక్ష్మీ, వందనా, కృష్ణవేణి, రమ్య, నాదెళ్ల నాగమణి, శ్రీదేవీ తదితరులు పాల్గొన్నారు.