Friday, November 22, 2024

మేక్రాన్ – పుతిన్ మ‌ధ్య మాటల యుద్ధం.. రష్యా ఆక్రమణను వ్యతిరేకించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న దండయాత్ర ప్రారంభించడానికి నాలుగైదు రోజుల ముందు ఇదే విషయంపై ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు చర్చలు దారితప్పి తీవ్ర వాదోపవాదాలకు దారి తీసినట్లు తెలిసింది. పుతిన్‌ ఆలోచనలను తప్పుపట్టిన ఉక్రెయిన్‌పై దురాక్రమణ వద్దని నిర్ద్వందంగా చెప్పిన మేక్రాన్‌ పుతిన్‌ను దులిపిపారేసినట్లు తెలుస్తోంది. కాగా వాగ్వాదం పెరిగిన నేపథ్యంలో పుతిన్‌ అర్ధంతరంగా సంభాషణ ముగించినట్లు చెబుతున్నారు. అయితే నాలుగు రోజుల తరువాత రష్యాలో పర్యటించిన మేక్రాన్‌ పుతిన్‌తో భేటీ అవడం విశేషం. మేక్రాన్‌-పుతిన్‌ సంభాషణలపై ఫ్రెంచ్‌ డాక్యుమెంటరీ విడుదలైంది. కాగా ఇది దౌత్య నియమాల ఉల్లంఘనగా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవరోవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

గత ఫిబ్రవరి 20న రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ల మధ్య సుదీర్ఘంగా ఫోన్‌ సంభాషణ సాగింది. ఆ సందర్భంగా ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు, తాము దండయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని పుతిన్‌ ప్రస్తావించారు. అయితే ఆ ప్రయత్నం మంచిదికాదని మేక్రాన్‌ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు తలనొప్పిగా మారిన వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడం ప్రమాదకరమని, వారికోసం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం సరికాదని హెచ్చరించారు. అయితే, పుతిన్‌ ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేయడంతో మేక్రాన్‌ ఆగ్రహోదగ్రుడై తీవ్రస్వరంతో వాదనకు దిగినట్లు డాక్యుమెంటరీలో వెల్లడైంది. యుద్ధం ఆలోచనే వద్దని చెప్పిన మేక్రాన్‌ ఆ సంభాషణల ఆడియో ఈ డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు. మీకు సలహాలిస్తున్న న్యాయవాదులకు చట్టం గురించి తెలియదా, అసలు న్యాయశాస్త్రం ఎక్కడ చదువుకున్నారంటూ మేక్రాన్‌ నిలదీసినట్లు స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్‌ అంశంపై ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వాలని, యుద్ధం కాకుండా మరే అర్ధవంతమైన చర్య తీసుకోబోతున్నారో చెప్పాలని మేక్రాన్‌ అడగటం ద్వారా పుతిన్‌తో సంభాషణ మొదలైంది.

కాగా డోన్‌బాస్‌పై ఒప్పందాలు జరిగాయంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అబద్ధాలు చెబుతున్నారని, వేర్పాటువాదులతో చర్చలకు ససేమిరా అంటున్నారని, 2014 ఒప్పందం వల్ల డోన్‌బాస్‌లో యుద్ధం ఆగిపోలేదని పుతిన్‌ చెప్పుకొచ్చారు. వేర్పాటువాదులు చట్టబద్ధంగా, దౌత్యపరంగా చర్చలకు సిద్ధమవుతూంటే జెలెన్‌స్కీ వ్యతిరేకించడాన్ని పుతిన్‌ తప్పుపట్టారు. మీరు చొరవ తీసుకుని వేర్పాటువాదులతో చర్చలు జరపాలని పుతిన్‌ కోరడంతో మేక్రాన్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉక్రెయిన్‌ చట్టాల గురించి వేర్పాటువాదుల ప్రతిపాదనలు ఎలా చేస్తారంటూ విరుచుకుపడ్డారు. ఒక దేశ సార్వభౌమాధికారం గురించి, ప్రజాస్వామ్య విధానాల గురించి మీ న్యాయవాదులకు తెలీదా? వారు ఎక్కడ చదువుకున్నారో తెలిస్తే, వారు చెప్పే నియమనిబంధనలు ఎక్కడున్నాయో చూపిస్తే తెలుసుకుంటానని ఎద్దేవా చేశారు. కాగా తీవ్ర అసహనానికి గురైన పుతిన్‌ మధ్యలో కల్పించుకుని.. ఉక్రెయిన్‌లోని ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవలేదని, వారు కుట్రద్వారా అధికారంలోకి వచ్చారని, అప్పుడు జరిగిన రక్తపాతానికి జెలెన్‌స్కీ బాధ్యుడని ఆరోపించారు. వేర్పాటువాదులతో జరపాలని ఈ సందర్భంగా మేక్రాన్‌ను మరోసారి పుతిన్‌ కోరగా తిరస్కరించారు.

కాగా తీవ్రస్థాయిలో జరిగిన సంభాషణను చల్లబరచడానికి మేక్రానే మళ్లిd చొరవ ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడితో భేటీ అవ్వాల్సిందిగా పుతిన్‌కు సూచించారు. కాగా అందుకు నిరాకరించిన పుతిన్‌ చిరాకుగా మాట్లాడారు. కాగా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయవద్దని, ఆ దేశ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు నిలిపివేయాలని, బెలారస్‌లో మోహరింపులు వద్దని కోరారు. బిడెన్‌తో భేటీ గురించి పత్రికా ప్రకటన జారీ చేయాలని కోరగా, ఆ చర్చను కొనసాగించడం ఇష్టం లేని పుతిన్‌… మీకు ఓ నిజం చెబుతున్నా.. ఐస్‌ హాకీ ఆడటానికి వెడుతున్నా.. ప్రస్తుతం జిమ్‌లో వ్యాయామం చేయడానికి వచ్చా.. నా సలహాదార్లతో మొదట మాట్లాడాలి.. అంటూ ఫోన్‌ సంభాషణను అర్ధంతరంగా ఆపారు. కాగా ఆ ఇద్దరు నేతల వాడీవేడి సంభాషణకు సంబంధించిన ఆడియోతో కూడిన డాక్యుమెంటరీ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్‌ మాట్లాడుతూ పుతిన్‌ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, రహస్య సంభాషణలను బహిర్గతం చేయడం దౌత్య నియమాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య సంభాషణ ఫిబ్రవరి 20న జరగ్గా 24న రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement