సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా చతికిలపడింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత వర్షం అడ్డంకిగా మారింది. అయితే సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టడంతో 50 ఓవర్ల మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఇక.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత జట్టు సఫారీల బ్యాటింగ్‌ను అడ్డుకోలేకపోయింది. తొలుత టఫటఫా వికెట్లు పడేసుకున్న సఫారీలు ఆ తర్వాత నిలకడగా ఆడుతూ రాణించారు. దీంతో 40 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 249 పరుగులు చేశారు.
ఇక.. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కుర్రాళ్లు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. దీంతో కెప్టెన్ శిఖర్‌ధావన్ (4), శుబ్‌మన్‌గిల్ (3), రుతురాజ్ గైక్వాడ్ (19), ఇషాన్ కిషాన్ (20) పరుగులు మాత్రమే చేశారు. ఇక.. కాస్త మెరుగైన ఆటతీరు కనబరిచిన శ్రేయస్ అయ్యర్ (50) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా చిక్కుల్లో పడింది. . ఇక.. సంజు శాంసన్ 86, శార్దూల్ ఠాకూర్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ క్రమంలో 37వ ఓవర్లో శార్దూల్ (33) పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (0) డక్ అవుటయ్యాడు. ఇక మొత్తం ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీమిండియా సఫారీల చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి చెందింది.