న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 15వ భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనున్న నేపథ్యంలో 16వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకోసం కోసం జులై 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 19గా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల పరిశీలనకు జులై 20, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జులై 22గా ఖరారు చేసింది. ఆగస్టు 6న ఉదయం గం. 10.00 నుంచి సాయంత్రం గం. 5.00 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే రోజు సాయంత్రం గం. 5.00కు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలియజేసింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో పార్లమెంటు ఉభయసభల్లోని సభ్యులు (నామినేటెడ్ సభ్యులు సహా ) ఓటర్లుగా వ్యవహరిస్తారు. రాజ్యసభలోని 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్‌సభలోని 543 మంది ఎన్నికైన సభ్యులు కలిపి మొత్తం 788 మంది ఈ ఎలక్ట్రోరల్ కాలేజీలో ఉంటారు. సీక్రెట్ బ్యాలట్ విధానాన్ని అనుసరిస్తూ ప్రాధాన్యతా ఓటు పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత.. ఇలా ఎంతమంది అభ్యర్థులుంటే అంతమందికి వారి పేరు చివర అంకెలు వేయడం ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక పెన్నులను పోలింగ్ సమయంలో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికల సంఘం సమకూర్చిన పెన్నుకాకుండా వేరే పెన్ను ఉపయోగించినట్టయితే, ఆ ఓటు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. పోలింగ్ పార్లమెంటు భవంతిలోని మొదటి అంతస్తులో ఉన్న 63వ నెంబర్ గదిలో జరుగుతుందని సీఈసీ పేర్కొంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులుగా లోక్‌సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభల సెక్రటరీ-జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారని, ఆ ప్రకారం ఈసారి ఎన్నికలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహారిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థిని కనీసం 20 మంది సభ్యులు (ఎంపీలు) ప్రతిపాదించాలని, మరో 20 మంది సమర్థిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 15,000/- చెల్లించాల్సి ఉంటుంది.
పోలింగ్, కౌంటింగ్ సమయంలో ప్రతి అభ్యర్థి తన తరఫున ప్రతినిధిగా ఒకరిని నియమించుకోవచ్చు. ఇకపోతే ఈ ఎన్నికల్లోనూ రాష్ట్రపతి ఎన్నికల తరహాలో ఏ పార్టీ విప్ జారీచేయడానికి వీల్లేదు. ప్రతి సభ్యుడు తనకు నచ్చినట్టుగా ఓటు వేసుకునే వెసులుబాటు ఉంది.