Saturday, November 23, 2024

ఆధ్యాత్మిక, చారిత్రక సమ్మేళనం వారణాసి కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో కాశీ నగరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత ఆయన సతీసమేతంగా శనివారం కాశీ మహానగరాన్ని సందర్శించారు. కాశీ విశ్వనాథుడి దర్శనానంతరం దశాశ్వమేథ ఘాట్‌లో గంగాహారతిలో పాల్గొన్నారు. గంగాదేవి ఆవాహన, సంప్రదాయా నూనె దీపాలతో హారతి, గంగామాతకు నైవేద్య సమర్పణ… ఇలా ఓ క్రమపద్ధతిలో జరిగిన ఉపచారాలను మంత్రముగ్ధుణ్నై చూస్తూ ఉండిపోయానని వెంకయ్య నాయుడు అన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజల శాంతి, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం తమ దంపతులం భగవంతుణ్ని ప్రార్థించామని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సందర్శించారు.

వారణాసిలోని ప్రఖ్యాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించుకున్న ఉపరాష్ట్రపతి ప్రపంచ ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారణాసికి కూతవేటు దూరంలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మృతి స్థలాన్ని సందర్శించారు. భారతదేశ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన వారి 63 అడుగుల విగ్రహం ముందు నిలబడడం వారి జీవితాన్ని స్ఫురణకు తెచ్చిందని ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖులు, అధికారులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకున్నానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement