హైదరాబాద్ : కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడని ఇవాళ మీరు చెబుతుంటే.. ఇన్ని జేసిండా అని ఆశ్చర్యమేస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించి ప్రసంగించారు. 2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే.. అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడిండు. ఇలా హమాలీలతో భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు.
ఐదేండ్లు సీఎం పదవి చేసినా వారి సమస్యలను తెలుసుకోని సీఎంలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చెమట చిందిస్తున్న కార్మికుల గురించి ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తది. క్రికెట్ మ్యాచ్‌కు కూర్చున్నట్టు కేసీఆర్ ప్రెస్ మీట్ల కోసం కరోనా సమయంలో కూర్చునేవారు. సార్ మాట వింటే ధైర్యం వస్తదని అనుకునే వారు చాలా మంది ఉండేవారు. ఆంధ్రాలో కూడా కేసీఆర్ మాటలను ఆసక్తిగా విన్న వారు ఉన్నారని కేటీఆర్ తెలిపారు.
కరోనా వచ్చినప్పుడు ఇండ్లలో ఉంటున్నారు.. కొందరు స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. ఇక హైదరాబాద్‌లో రోడ్లు, బిల్డింగ్‌లో పని చేసే కార్మికులు ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది కార్మికులు.. దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉన్నారు. 90 శాతం మంది కార్మికులు బయటోళ్లు ఉన్నారు. ఇటుక బట్టీల వద్ద, హోటల్‌లో కార్మికులు ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. ఇలా 35 లక్షల మంది ఉన్నారని తేలింది. వాళ్లది నా రాష్ట్రం కాదు.. నాకు ఓట్లు వేసేటోళ్లు కాదని కేసీఆర్‌కు తెలుసు. కానీ మనస్సున్న ముఖ్యమంత్రి, కార్మికుల పక్షపాతి కాబట్టి.. వీళ్లు కార్మికులు కాదు.. మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని కేసీఆర్ అన్నారు. మీ కష్టం గురించి ఆయనకు తెలుసు.
అభివృద్ధిలో మీరు భాగస్వాములు.. రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేకపోవచ్చు. అయినా కూడా వెయ్యి రూపాయాలు జేబులో పెట్టి.. అన్నం పెట్టి, ఉచితంగా రైళ్లో మీ ఇంటికాడ దింపేసి వస్తానని చెప్పిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్. అది కేసీఆర్ నాయకత్వం.. కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాకనే కేసీఆర్‌కు కార్మికులపై ప్రేమ రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో 2004లో చేరినప్పుడు కేసీఆర్‌కు ఓడరేవుల ఫోర్ట్ పోలియో ఇచ్చారు. ఆ ఫోర్ట్ పోలియే కావాలని డీఎంకే పంచాయితీ పెట్టింది. నేను ఈ పదవుల కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చామని, వారికి షిప్పింగ్ పోర్టపోలియో ఇవ్వాలని మన్మోహన్ సింగ్‌కు చెప్పిండు కేసీఆర్. 9 నెలల వరకు ఎలాంటి పదవి తీసుకోలేదన్నారు.
ఆఖరికి పార్లమెంట్‌లో ప్రతిపక్ష బీజేపీ.. కేబినెట్‌లో ఫోర్ట్ పోలియో లేని మంత్రి ఉంటాడా..? అని మాట్లాడితే మన్మోహన్ సింగ్.. కేసీఆర్‌ని పిలిచి ఫోర్ట్ పోలియో తీసుకోవాలంటే.. తెలంగాణ మీద ముందడుగు వేస్తే తీసుకుంటా అని చెప్పిండు. సరే అని చెప్పి.. ఏం ఫోర్ట్ పోలియో కావాలని అడిగారు. కార్మిక శాఖ ఏరికోరి తీసుకొని.. బీడీ కార్మికులకు నాడే దేశ వ్యాప్తంగా వేలాది ఇండ్లు మంజూరు చేశారు. అసంఘటిత కార్మికుల కోసం 2005లో కమిటీ వేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వీడి బయటకు వచ్చారు. దాంతో అసంఘటిత కార్మికులను సంఘటితం చేసే పని అసంపూర్తిగా మిగిలిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు.
రూ. లక్షా 40 వేల కోట్లు అప్పు … ఏం చేశావ్
ఈ ఏడాది కాలంలో రూ. లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏ పీకినవ్ రేవంత్ రెడ్డి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఒక కొత్త ఇటుక పెట్టినవా, ఒక కొత్త పైప్ లైన్ వేసినావా, ఒక కాలువ తవ్వినవా, ఒక కార్మికుడికి లాభం తెచ్చవా, ఒక ఆడబిడ్డకు రూ.2500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చవా..? ఏం పీకినవ్ సంవత్సరంలో అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.