న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు, విద్యారంగంలో నాణ్యత పెంచి అందరికీ చేరువ చేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కొవిడ్ నేపథ్యంలో విద్యా రంగంలో నూతన ఆలోచనల అభివృద్ధిని ప్రస్తావిస్తూ, సాంకేతిక విధానాలు విద్యా రంగాన్ని మరింత ఉన్నతంగా మార్చాయని తెలిపారు. మంగళవారం చెన్నైలో జరిగిన ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ 10వ ఎడిషన్ థింక్ ఎడ్యుకాన్ క్లేవ్లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి టి.ఎం. అన్బరసన్, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లోక్సభ సభ్యులు శశిథరూర్, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ డైరక్టర్ ప్రభు చావ్లా, సీఈవో శ్రీలక్ష్మీ మీనన్ తదితరులు పాల్గొన్నారు. మన విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, అంతరాలు లేకుండా అందరికీ విద్యను అందించే దేశంగా ఎలా ముందుకు సాగగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరాన్ని వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు.
భారతదేశ విద్యారంగంలో నూతన జాతీయ విద్యా విధానం సానుకూల మార్పులకు నాంది పలకగలదన్న ఆయన, సంపూర్ణ విద్యతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు సరికొత్త మార్గాల అవసరముందని అభిప్రాయపడ్డారు. విద్య జాతీయ పరివర్తన సాధనంగా మారాలన్న వెంకయ్య…. విద్య ద్వారా విజ్ఞానం, తద్వారా ఉన్నతమైన సాంఘిక జీవనం దిశగా యువతను ముందుకు నడిపేలా సంస్కరణలు రావలసిన అవసరం ఉందని సూచించారు. భారతదేశ వైభవానికి కారణమైన మహనీయుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందేలా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో సాగించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. స్థానిక భాషల్లోనే పరిపాలన, న్యాయ వ్యవస్థ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సనాతన భారతీయ విలువలపై దృష్టి పెడుతూనే, కృత్రిమ మేథస్సు వంటి సమకాలీన సాంకేతికతలపై దష్టిసారించాలని చెప్పారు. నవభారత నిర్మాణంలో నాణ్యమైన విద్య మరింత కీలకమని తెలిపారు.
ముఖ్యంగా వ్యవసాయరంగంలో సరికొత్త ఆవిష్కరణల దిశగా విద్యారంగం, పారిశ్రామిక రంగం కలిసి కృషి చేయాలని ఉపరాష్ట్రతి పిలుపునిచ్చారు. యువజన శక్తికి కేంద్రమైన భారతదేశంలో కష్టపడి పనిచేసే యువతకు కొదువ లేదని, దానికి తగ్గట్లుగా యువత నైపుణ్యాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమౌతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు, మీడియా దీనికి అనుకూలమైన వేదికల కోసం కృషి చేయాలని సూచించారు. స్వరాజ్యం సముపార్జించుకున్నప్పటి పరిస్థితులతో పోలిస్తే అక్షరాస్యత రేటు మెరుగుపడడం, లింగ నిష్పత్తిలో సమానత్వాన్ని సాధించడం లాంటి భారతదేశ విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, స్వరాజ్యం వచ్చినప్పుడు 18 శాతంగా ఉన్న అక్షరాస్యత 80 శాతానికి చేరుకోవడం ఆశించదగిన పరిణామమని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి విశ్వగురువుగా పేరు గాంచిన భారతదేశ గత వైభవాన్ని నిలబెట్టాల్సిన అవసరాన్ని చెప్పిన వెంకయ్య ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..