Tuesday, November 19, 2024

ఆరని జ్వాల, కొనసాగిన ఆందోళనలు.. నాలుగోరోజూ హింసాత్మకం

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. బీహార్‌, పంజాబ్‌లోని లూధియానా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అగ్నిపథ్‌ పథకం ప్రకటించిన తరువాత బీహార్‌లోనే హింస ఎక్కువగా చెలరేగింది. కాగా ఈ రోజు (శనివారం) బంద్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి ఎనిమిది గంటల వరకు రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. మళ్లి ఆదివారం తెల్లవారు జామునుంచి రాత్రి ఎనిమిది వరకు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బంద్‌ సందర్భంగా బీహార్‌లో ఒక రైల్వే స్టేషన్‌ను, ఒక పోలీస్‌ వాహనాన్ని ఆందోళకారులు తగలబెట్టారు. రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. దేశం మొత్తం మీద శనివారం నాడు 350 రైళ్లను రద్దు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనూ ఆందోళనలు చెలరేగాయి. ఢిల్లి, హర్యానా, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌, రాజస్థాన్‌ సహా ఎనిమిది రాష్ట్రాలలో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆందోళనలు కేరళనూ తాకాయి. తిరువనంతపురం, కోజికోడ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించిన ఆందోళనకారులు అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్రలు, రాళ్లతో దాడికి విఫలయత్నం చేశారు. మరోవైపు బీహార్‌లో డిప్యూటీ సీఎం రేణుదేవి ఇంటిపై దాడి చేసిన ఆందోళన కారులు లఖిసరాయ్‌, అరాలలో రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించి రైళ్లకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. వేలాదిమంది ఆర్మీ అభ్యర్థులు రైల్వేస్టేషన్లలోకి జొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. పరిస్థితులు చేయిదాటిపోతూండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్ల వ్యవస్థను స్తంభింపచేసింది. జూన్‌ 19వరకు టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను కైమూర్‌, భోజ్‌పూర్‌, ఔరంగాబాద్‌, రోహ్‌తాస్‌, బక్సర్‌, నవడ, వెస్ట్‌ చంపారన్‌, సమస్తిపూర్‌, లఖిసరాయ్‌, బెగుసరాయ్‌, వైశాలి, సరణ్‌లలో రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని 24 పగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలోని మహేందర్‌గఢ్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌, జోధ్‌పూర్‌, జుజ్ను, ఆళ్వార్‌లలో నిరసనలు వెల్లువెత్తాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో…

ప్రధాని ప్రాతనిధ్యం వహిస్తున్న వారణాసి, బల్లియా, ఫిరోజాబాద్‌, అమేథి సహా అనేక జిలాల్లో శుక్ర, శనివారాల్లో ఆందోళనకారులు అల్లర్లకు దిగారు. శుక్రవారం బల్లియాలో ఖాళీ రైలును దగ్ధం చేసిన ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులు, బస్సులను ధ్వంసం చేశారు. స్థానిక బీజేపీ నాయకుడి కారుకు నిప్పు పెట్టారు. యూపీలో మధుర, బల్లియా, అలీగఢ్‌, వారణాసి, గౌతమ్‌బుద్ధ నగర్‌లలో ఇప్పటివరకు 260మందిని అరెస్టు చేశారు. అటు హర్యానాలోని బల్లభాగ్రాలో రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేశారు. రోహ్‌తక్‌లో పట్టాలపై టైర్లువేసి తగలబెట్టారు. పల్వాల్‌ జిల్లాలో శనివారం రాత్రివరకు ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ కాల్స్‌ రద్దు చేశారు. పల్వాల్‌, ఫరీదాబాద్‌, రోహ్‌తక్‌, నారనౌల్‌సహా పలు ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడిన వెయ్యిమందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రాజస్తాన్‌లోని ఆగ్రా-బండికూయ్‌ రైల్వే ట్రాక్‌పై నిరసనకారులు బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేయడతో బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. చిత్తోర్‌గడ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది.

బీహార్‌ బీజేపీ నేతల ఆగ్రహం

తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ఆందోళనలను కట్టడి చేయడానికి కనీస ప్రయత్నం చేయడంలేదని నితీష్‌ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దీనిపై మిత్రపక్షం గుర్రుగా ఉంది. అగ్నిపథ్‌ పథకం ప్రకటించిన తరువాత బీహార్‌లోనే ఎక్కువగా ఆందోళనలు తలెత్తాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఇల్లు సహా అనేకమంది బీజేపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో నితీష్‌ ప్రభుత్వం మౌనంగా ఉండటం వారి ఆగ్రహానికి కారణం. నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంది, అంతమాత్రాన ఆందోళనకారులకు స్వేచ్ఛనిచ్చి, హింసను కట్టడి చేయకపోవడం తప్పని అధికారపక్షానికి చెందిన సంజయ్‌ జైవాల్‌ విమర్శించారు. బీహార్‌లోని బెట్టియ పట్టణంలో తన ఇంటికి నిప్పుపెట్టారని, అగ్నిమాపక దళానికి ఫోన్‌ చేస్తే సరైన విధంగా స్పందించలేదని ఆరోపించారు. అయితే బీజేపీ నేతల ఆరోపణలను జేడీయూ నేతలు కొట్టిపారేశారు. యువత మనసులోని బాధను అర్థం చేసుకోవాలని జేడీయూకు చెందిన రంజన్‌ సూచించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement