న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజి కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సెషన్స్ కోర్టులో చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసులోని మెరిట్స్ ఆధారంగా సెషన్స్ కోర్టు విచారణ జరపాలని సూచించింది. సెషన్స్ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించేందుకు నారాయణకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఆలోగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2022 ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలో జిల్లా పరిషత్ హైస్కూలు నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. వాట్సాప్ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లీకేజి వెనుక మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉందని పోలీసులు ఆరోపించారు. అయితే 2014లోనే విద్యాసంస్థల నుంచి నారాయణ వైదొలిగారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై జిల్లా కోర్టుతో పాటు హైకోర్టులో గత కొద్ది నెలలుగా విచారణ జరుగుతోంది. నారాయణకు మంజురైన బెయిల్‌ను తాజాగా హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.