హైదరాబాద్, ఆంధ్రప్రభ: మోడల్ స్కూల్స్, కేజీ బీవీలో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్నట్లు తెలిసింది. ఈమేరకు మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.మహేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈక్రమంలో బదిలీల ప్రక్రియపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.
వారంలోగా ఈ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు మంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలా కాకుండా మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల బదిలీలకు ఎలాంటి అడ్డంకులు లేవని, వెంటనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు. దాంతో త్వరలోనే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి