Friday, November 22, 2024

ఇక గంటకు 200 కి.మీ వేగంతో ప‌రిగెట్టనున్న రైళ్లు.. దేశంలో ఫస్ట్​ సికింద్రాబాద్‌- బెంగళూరు మధ్యే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ఇక రైలులో మూడు గంటల్లోనే ప్రయాణించొచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ నూతన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. సెమీ-హై స్పీడ్‌ ట్రాక్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ట్రాక్‌పై నడిచే రైళ్లు గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్నాయి. దాదాపు రూ.30వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రత్యేకంగా సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు వరకు ట్రాక్‌ను నిర్మించ బోతున్నారు. సికింద్రాబాద్‌-బెంగళూరుల మధ్య వాస్తవదూరం 622 కి.మీలు. నూతనంగా నిర్మించబోయే ట్రాక్‌ను శంషాబాద్‌ సమీపం నుంచి చేపడుతున్నారు. దీంతో 503 కి.మీ లోపునే ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. శంషాబాద్‌కు సమీపంలో ఉన్న ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బెంగళూరు సమీపంలోని యెలహంక స్టేషన్‌ వరకు నిర్మిస్తున్నారు. నూతనంగా ప్రణాళిక రూపొందించిన ఈ సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ కోసం ఇండియన్‌ రైల్వే కిలోమీటర్‌కు ఏకంగా రూ.60కోట్లు ఖర్చు చేస్తోంది. ట్రాక్‌కు రెండు పక్కల 1.5 మీటర్ల పొడవుతో గోడను కూడా నిర్మించనున్నారు.

ఢిల్లి, మీరట్‌ల మధ్య ముంబై-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న బుల్టెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం కిలోమీటరు కు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం రైల్వే అధికారులు ఢిల్లి-ముంబై , ఢిల్లి-హౌరా మార్గాలను ఆధునీకరిస్తున్నారు. ఈ ట్రాక్‌లపై రైళ్ల గంటకు 160 కి. మీ. వేగంతో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌-బెంగళూరు మధ్య నిర్మించనున్న ట్రాక్‌ను గంటకు 200 కి.మీ. వేగంతో దూసుకెల్లేలా నిర్మించనున్నారు. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా రెండు ఐటీ పట్టణాల మధ్య హైస్పీడ్‌ ట్రాక్‌ను నిర్మించే యోచనలో ఉంది. రైల్వే లైన్లను ఆధునీకరించే క్రమంలో ఇండియన్‌ రైల్వేస్‌ అధునాతను సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే రై ళ్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ గంటకు 106 కి. మీ వేగంతో దూసుకెల్లే 302 వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సీఎం గతిశక్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రోడ్లు, రైల్వే, విమానయానం, అధునాత రవాణా సదుపాయాలు అందించే క్రమంలోనే కోట్లాది రూపాయలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్‌ రైలవే కొత్తగా గంటలకు 200 కి. మీ . వేగంతో నడిచే రైల్వే ట్రాక్‌ ప్రాజెక్టుకు రూప కల్పన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement