Tuesday, November 19, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. కుండపోతకి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో సహా హైదరాబాద్‌లో ఈ రోజు (గురువారం) కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగడంతో వరదనీరు గ్రామాల్లోకి చేరుతోంది. ఎడతెరిపి లేని వర్షం కురవడంతో హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షపునీరు వచ్చి చేరింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాదాపూర్‌, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, బండ్లగూడజాకీర్‌ ప్రాంతాలతో పాటు అత్తాపూర్‌, శివరాంపల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు మిగతా ప్రాంతాల్లో తీవ్ర వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపైకి వచ్చిన నీరును తొలగించే పనిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమగ్నమయ్యారు.

మూసారాంబాగ్‌ వంతెనకు మరమ్మతులు..

మూసీనది ఉధృతంగా ప్రవహించడంతో ధ్వంసమైన మూసారాంబాగ్‌ వంతెన మరమ్మతులను అధికారులను చేపట్టారు. వంతెన పూర్తిగా బురద, రాళ్లు పేరుకుపోవడంతో అధికారులు వాటిని తొలగిస్తున్నారు. వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇవరువైపులా ఎవరిని వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వరద ప్రవహానికి వంతెన బాగా దెబ్బతిన్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. శుక్రవారం మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆ తర్వాత వాహన రాకపోకలకు అనుమతులు ఇస్తామని అధికారులు తెలిపారు. వంతెన మరమ్మతుల నేపథ్యంలో అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే వాహనాలను గోల్నాక వద్ద మళ్లిస్తున్నారు. కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement