అమరావతి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలౌవుతున్న టోల్ పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశాబ్దాల కాలంగా ఉన్న టోల్‌ప్లాజాల వ్యవస్థకు మంగళం పలికేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగించి దాని స్థానంలో జీపీఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు గత ఏడాది నిర్ణయం తీసుకున్న కేంద్రం కొత్త పాలసీని సాధ్యమైనంత త్వరగా అమలుచేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు జాతీయ రహదారులపై నిర్ణీత దూరం , పరిధిలో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో టోల్‌ప్లాజాల వద్ద రద్దీని నియంత్రించేందుకు గంటల తరబడి వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యక్ష నగదు వసూళ్లకు చెక్ పెట్టిన ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఈ ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావడంతో అన్ని టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పూర్తిగా తగ్గడంతో పాటు వాహనదారుల ప్రయాణం సులువుగా మారింది. ఫాస్టాగ్ విధానం సక్సెస్ కావడంతో ఇప్పుడు జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులువుగా మార్చేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ టోల్‌ప్లాజాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది. శాటిలైట్ ఆధారిత జీపీఎస్ ట్రాకింగ్ విధానానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
దీనిలో భాగంగా ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చి దీని ద్వారా వాహన ప్రయాణాన్ని ట్రాకింగ్ చేసి టోల్ ఛార్జీలు వసూలు చేసే వ్యవస్థకు అంకురార్పణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉత్తరాధి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ జీపీఎస్ ఆధారిత ట్యాక్స్ వసూళ్ల ఫైలట్ ప్రాజెక్టును అమల్లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాదంతా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేసి లోటుపాట్లను తీసుకోవాల్సిన ఇతర చర్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి కొత్త పాలసీని దేశవ్యాప్తంగా విడతల వారీగా అమలుచేయాలని భావిస్తోంది. కొత్తగా వచ్చే వాహనాలతో జీపీఎస్‌ను అమర్చేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాత వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలు అమర్చేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్‌ను ఏవిధంగా అమలు చేస్తున్నారో అదే తరహాలో ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..