Monday, November 18, 2024

Delhi | కాంగ్రెస్ బీసీ గర్జనకు ముహూర్తం ఖరారు.. అక్టోబర్ 10న భారీ సభ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ బీసీ గర్జనకు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ నగర శివార్లలో షాద్‌నగర్ వద్ద ఈ సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించిన వీహెచ్, బీసీ గర్జన సభకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య హాజరవుతారని వీహెచ్ తెలిపారు.

కర్ణాటకలో దళిత, బహుజన, ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన సిద్ధరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ద్వారా కర్ణాటక తరహాలో వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం ఉండాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని వీహెచ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

- Advertisement -

బీసీ గర్జన ద్వారా తెలంగాణలోని బీసీ వర్గాల్లో నూతనోత్సాహం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో వెనుకబడిన వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ గర్జనను బీసీలంతా కలిసి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరామని, మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని వీహెచ్ గుర్తుచేశారు. చెప్పిన ప్రకారం కనీసం 34 సీట్లైనా ఇస్తారా.. లేక ఇంకా ఎక్కువ ఇస్తారా అన్నది త్వరలో తేలుతుందని ఆయనన్నారు. కొద్దిరోజుల క్రితం పార్టీ విడుదల చేసిన 6 గ్యారంటీలు పార్టీ విజయానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement