హైదరాబాద్, ఆంధ్రప్రభ : సాధారణంగా వర్షాకాలం అంటే ఎక్కువగా పాములు సంచరించే కాలం. ఆరుబయట గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు మొలిచి పాములకు అనువైన ఆవాసంగా మారే సీజన్ ఇది. ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు విస్తారంగా కురుస్తున్న వర్షం నీరు, వరద పాముల పుట్టల్లోకి, వాటి ఆవాస ప్రాంతాల్లోకి చేరుతుండడంతో విష సర్పాలు ఎక్కువగా ఆరుబయట సంచరిస్తుంటాయి. ఈ పరిస్థితులు ప్రజలు ముఖ్యంగా రైతులు పాము కాటుబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పొలం పనులు ముమ్మరంగా సాగే సీజన్ కావడంతో రైతులు విష పురుగుల కాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పాములు పొలం గట్ల మీద, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం, గుబురు ప్రదేశాలు, పెంట దిబ్బలు, గడ్డివాములు ఉన్న ప్రాంతాల్లో నక్కి ఉంటాయి. పొలాల పక్కనే ఉన్న ఇళ్లలోకి తరచూ వస్తుంటాయి. ఇంటి పరిసరాల్లో చిందరవందరగా సామాన్లు పడేసిన గదుల్లో, పరిసరాల్లో మదుగు ఎక్కువగా ఉన్న చోట్ల పాములు తల దాచుకుంటుంటాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, సాధారణ ప్రజలు పాము కాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పాము కాటు మరణాలు సంభవిస్తున్నాయి. గోదావరి వరదలు వచ్చిన భద్రాచలం ప్రాంతంలో వరదతోపాటు ఇళ్లలోకి పాములు, తేళ్లు వచ్చి చేరడంతో పలువురు వాటి కాటుకు గురవుతున్నారు.
ఇల్లు, పొలం వద్ద మరుగు లేకుండా చూసుకోవాలి..
పాముకాటు బారిన పడకుండా ఉండాలంటే ముందుగా వాటికి ఆవాసయోగ్యమైన పరిస్థితులు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో వస్తువులు, ధాన్యం సంచులు తదితరాలతో మరుగు ఏర్పడకుండా చూసుకోవాలి, పిల్లలను గుట్టలు, పుట్టల దగ్గర ఆటలాడనివ్వకుండా జాగ్రత్త వహించాలి. రాత్రి సమయంలో లైట్లు వేసుకుని, కిందకు చూసుకుంటూ వెళుతూ కాలకృత్యాలు తీర్చుకోవాలి. రైతులు పశువులను పాకల్లో కట్టేసినపుడు అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొలాలకు వెళ్లేటప్పుడు కర్రను చేతిలో ఉంచుకోవడంతోపాటు వినికిడి శబ్దాలు చేసే పరికరాలు దగ్గర ఉంచుకోవాలి. రాత్రి, తెల్లవారుజామున పొలాలకు వెళ్లే సమయంలో టార్చ లైట్ సాయంతో తోవను చూసుకుంటూ వెళ్లాలి. మట్టి, పెంకుటిళ్లకు ఎక్కడా రంద్రాలు, పలుగులు లేకుండా చూసుకోవాలి.
వ్యవసాయ పనులు పొంచి ఉన్న ప్రమాదం..
పొలాలకు నీరు పెట్టేందుకు, వ్యవసాయ పనులకు పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు వెళ్లాల్సిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో రైతులు రాత్రి, తెల్లవారు సమయాల్లో చూడకుండా పాములను తొక్కుతుండడంతో అవి కాటు వేస్తున్న సందర్బాలు అనేకం. రాత్రి సమయాల్లో పొలాల్లో తిరిగేవారు, పొలంకాడే నిద్రించేవారు అధికంగా పాముకాటుకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
అన్ని పాములు విషపూరితం కావు…
పాముల్లో అన్ని పాములు విషపూరితమైనవి కావని… నాగుపాము, త్రాచుపాము, రక్తపింజర, కట్లపాము, తెట్టెపురుగు అత్యంత విషపూరితమైనవని వైద్యులు చెబుతున్నారు. పాము కాటువేసి చోట రెండు గాట్లు పడితే అది విషసర్పం కాటుగా గుర్తించాలి. పాము కాటుకు గురైన తర్వాత ధైర్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. భయపడితే విషం వేగంగా మెదడుకు చేరుకుంటుంది. పాముకాటు వేసిన వెంటనే తాడుతో లేదా గుడ్డతో కొంత శరీరాన్ని రక్తం ఆడకుండా బిగించి కట్టాలి. గాయం చేసి రక్తం కారనివ్వాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం కాని, పరుగులు పెట్టించవద్దని సూచిస్తున్నారు. ఆలస్యం చేయకుండా గంటలోపు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నాటువైద్యం, పసర్లు, మంత్రాల పేరిట ఆసుపత్రికి తీసుకెళ్లడంలో జాప్యం చేయొద్దు. పాము కాటేసిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఏ పాము కరిచిందో వైద్యుడికి చెప్పి యాంటీవీనమ్ ఇంజక్షన్‌ను వెంటనే తీసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.