Friday, November 22, 2024

త్వరలో మెట్రో రెండవ దశ పనులకు టెండర్ల ఖరారు

  • రాయదుర్గం నుంచి విమానాశ్రయంకు సర్వే పూర్తి
  • ఈపీసీ పద్దతిలో టెండర్లు ఖరారు

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : హైదరాబాద్‌ మహా నగరానికి మణిహారంగా మారిన మెట్రో రెండవ దశ పనులకు త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. రాయదుర్గం నుంచి అంతర్జాతీయ రాజీవ్‌గాంధీ విమానాశ్రయం వరకు రెండవ దశలో 31 కిలోమీటర్ల పొడవైనమెట్రో మార్గాన్ని నిర్మించడానికి సర్వే దాదాపుగా పూర్తి అయింది. రూ. 6,250 కోట్ల నిధులతో చేపట్టనున్న ఇట్టి పనులకు రెండు నెలల్లో టెండర్లను పూర్తి చేయాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో (హెచ్‌ఏఎంఎల్‌) సంస్థ బావిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులో కీలకమైన ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ ఎంపికను పూర్తి చేసిన అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు ప్రారంభించారు.

ఈపీసీ విధానంలో :
మెట్రో టెండర్లను ఈపీసీ విధానంలో నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) పద్దతిలో రాయదుర్గం- విమానాశ్రయం మెట్రో మార్గానికి గ్లోబల్‌ టెండర్లను పిలవనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లిdకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంతకంటే ముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని బావిస్తున్నారు. రాయదుర్గం- విమానాశ్రయం మార్గం మెట్రోకు మూడు సంవత్సరాల క్రితమే డీపీఆర్‌ తయారు చేసినప్పటికి ప్రస్తుతం అందులో చాలా మార్పులు వచ్చాయని అధికారులు అంటున్నారు. ఇటీవల అలైన్‌మెంట్‌ పరిశీలించి మార్కింగ్‌ చేయడం జరిగింది. తుది మార్కింగ్‌ పనులను ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ చేపట్టనున్నది. వీటిని టెండర్‌ కన్నా ముందే పూర్తి చేసి దానికి అనుగుణంగా టెండర్‌ ప్రక్రియను చేపట్టడానికి మెట్రో రైల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 31 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం కు రూ. 6,250 కోట్లుగా నిర్ణయించారు. దీనిని 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

టెండర్‌ ప్రక్రియ :
విమానాశ్రయం మెట్రోకు రూ. 6,250 కోట్ల అంచనాలతో ప్రణాళికలు రూపోందించారు. ఈ ధర కంటే ఎవరు తక్కువగా కోడ్‌ చేస్తే టెండర్‌ను వారికి కేటాయించనున్నారు. అయితే టెండర్‌లో పాల్గోనడానికి అర్హతలను , మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఆ మార్గదర్శకాలు ఉన్న వారికే టెండర్‌ ప్రక్రియలో పాల్గోనడానికి అర్హత ఉంటుంది. ఇందులో ప్రధానంగా మెట్రో మార్గం నిర్మాణంలో అనుభవం, సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. టెండర్లను రెండు దశల్లో పరిశీలించి టెండర్లను అప్పగిస్తారు. మెట్రో మొదటి దశ చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ సైతం బిడ్డింగ్‌లో పాల్గోననున్నది. వీరితో పాటు ఇన్‌ఫ్రా సంస్థలు, కన్జార్షియంలు మెట్రో ప్రాజెక్టు గ్లోబల్‌ బిడ్డింగ్‌లో పాల్గోనే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జూలై నాటికి మెట్రో రెండవ దశ (రాయదుర్గం- విమానాశ్రయం ) మార్గానికి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని బావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement