విద్యుత్ బస్సుల నిర్వాహణకు, డీజిల్ బస్సుల కంటే 29 శాతం తక్కవకే టెండర్లు వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ (ఇఎఫ్ఎస్ఎల్)కు చెందిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ దేశంలో 6,465 విద్యుత్ బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ విద్యుత్ బస్సులను ఢిల్లి, తెలంగాణ, హర్యానా, సూరత్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్ల కోసం సేకరించనున్నారు. వీటిని సరఫరా చేసే సంస్థలే వాటిని నిర్వహించనున్నాయి. ఇందు కోసం పిలిచిన టెండర్లలో డీజిల్ బస్సుల నిర్వాహణ వ్యయం కంటే 29 శాతం తక్కువకే కంపెనీలు కోట్ చేశాయి.
నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రామ్ (ఎన్‌ఈబీపీ) కింద ఈ టెండర్లను పిలిచారు. నగరాలోనే తిరిగే 12 మీటర్ల బస్సుల నిర్వహణకు కిలో మీటర్‌కు 54.3 రూపాయలు, నగరాలను కలుతూ తిరిగే 12 మీటర్ల బస్సుల నిర్వహణకు కిలోమీటర్‌కు 39.8 రూపాయలకు టెండర్లు వచ్చాయి. ఇక 9మీటర్ల పొడవు ఉన్న విద్యుత్ బస్సులకు కిలోమీటర్‌కు 54.46 రూపాయలు, 7 మీటర్ల పొడవున్న బస్సులకు కిలోమీటర్‌కు 61.92 రూపాయలకు టెండర్లు వచ్చాయి. ఇవి సబ్సిడీ కలపక ముందు రేట్లు. ఈ రేట్లు డీజిల్ బస్సుల నిర్వహణ కంటే 29 శాతం తక్కువని సంస్థ తెలిపింది.
ఈ పరిణామం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఎలక్ట్రిక్ మొబిలిటీకి కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుందని సీఈఎస్ఎల్ ఎండీ, సీఈఓ మహూవా ఆచార్య చెప్పారు. వచ్చే 5 సంవత్సరాల్లో దేశంలోని రోడ్డు రవాణా సంస్థలకు 50 వేల విద్యుత్ బస్సులు సరఫరా చేయాలన్న లక్ష్యంలో భాగంగానే టెండర్‌ను పిలిచినట్లు ఆమె వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆధునీకరించి, బలోపేతం చేసే చర్యల్లో భాగంగానే విద్యుత్ బస్సులను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం టెండర్లలో వచ్చిన ధరలు చిన్న నగరాల్లోనూ విద్యుత్ బస్సులను ఆపరేట్ చేసేందుకు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. రేట్లు తక్కువగా ఉన్నందున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు వీటిని భరించకలిగే పరిస్థితి ఉంటుందన్నారు.
ప్రస్తుతం రానున్న బస్సులు ఒక ఛార్జింగ్‌తో 325 కిలోమీటర్ల దూరం ప్రయాణీంచగలవు. వీటిని నగరాల్లోనూ, నగరాల మధ్య ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉన్నాయన్నారు. 30,800 కోట్లుతో విద్యుత్ బస్సులను సేకరించనున్నారు. ఈ విద్యుత్ బస్సులు 12 సంవత్సరాల్లో 5,718 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణీస్తాయని అంచనా.
ఈ కాలానికి 1,842 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అంచనా వేశారు. వీటి వల్ల 4.62 మిలియన్ టన్నుల కాలుష్య వాయివులు తగ్గుతాయి. టెండర్ల ప్రకారం విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు కొనుగోలు చేసి వాటిని 10 నుంచి 12 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. వీటిని రాష్ట్రాల ఆర్టీసీలకు అప్పగిస్తారు. వీటి నిర్వహణ కోసం ఆయా సంస్థలు కిలో మీటరుకు నిర్ణయించిన వేర చెల్లిస్తాయి. నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు సీఈఎస్ఎల్ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు 50 వేల బస్సులను అందించనుంది.