ఎండల తీవ్రత రోజు రోజుకీపెరుగుతుండడంతో విద్యార్ధులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఒక్కపూటబడులు నిర్వహిస్తే మంచిదనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటిపూట బడులు నిర్వహించే విషయంపై విద్యాశాఖ ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి ఏటా మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు నడుస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేసేవి. ఒంటి పూట బడుల సమయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించేవారు. వార్షిక పరీక్షల అనంతరం ఏప్రిల్ 28వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించి, జూన్ 12న తిరిగి స్కూల్స్ పున:ప్రారంభమయ్యేవి.
కానీ కరోనా నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ చాలా ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన మొదట ప్రారంభమైతే, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తేదీలోపు 6,7, 8వ తరగతలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అడపాదడపా నమోదవుతున్నాగానీ విద్యార్థులను పాఠశాలలకు పేరెంట్స్ పంపిస్తున్నారు. కానీవారం, పది రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు జంకుతున్నారు. ఈక్రమంలో ఒంటిపూటబడులు నిర్వహించాలనే అభిప్రాయాలు అటు విద్యార్థులతల్లిదండ్రుల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలనే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 6, 7, 8, 9వ తరగతులకు మాత్రమే ఒంటి పూట బడులు నిర్వహించి 10వ తరగతి విద్యార్థులకు తరగతులు యథావిధిగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.పదో తరగతి విద్యార్థులకు మే 17 నుంచి వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈమేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఒంటి పూట బడులు నిర్వహణపై మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ
ప్రభుత్వం నుంచి అనుకూలమైన నిర్ణయం వస్తే మార్చి 22 లేదా 28 నుంచి ఒంటి
పూట బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే యథావిధిగా
తరగతులు కొనసాగనున్నట్లు సమాచారం.