Tuesday, November 26, 2024

టార్గెట్​ ఐదు లక్షల డబుల్​ ఇళ్లు.. ఈనెలలోనే భారీగా గృహ ప్రవేశాలు

అమరావతి,ఆంధ్రప్రభ: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లలోకి గృహ ప్రవేశాలు చేయాలని భారీ టార్గెట్‌ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కొద్దిలో దాన్ని అందుకోలేకపోయింది. అప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల ఇళ్లు సిద్దంగా ఉన్నప్పటికీ ఉగాది సమయంలో లబ్దిదారుల సెంటిమెంట్‌, అసెంబ్లిd సమావేశాలు జరుగుతుండడంతో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. అప్పుడు వాయిదా పడ్డ ఐదు లక్షల గృహ ప్రవేశాలను ఈసారి ఈనెల చివరిలోపు పెద్ద పండుగలా జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని సిఎం జగన్మోహన్‌రెడ్డి హౌసింగ్‌ అధికారులను తెలియజేసి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ రోజుకు రెండు వేల గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ షా తెలిపారు.

ఇప్పటికే సిద్ధంగా 4.6 లక్షల ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణాలు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. భారీ టార్గెట్‌ను పెట్టుకున్న హౌసింగ్‌ అధికారులు అందకనుగుణంగా చకాచకా పనులు సాగిస్తున్నారు. ఇతర డిపార్టమెంట్లలో నిధుల కొరత ఉన్నప్పటికీ హౌసింగ్‌కు మాత్రం ఆ సమస్య లేదు. లబ్దిదారులకు గానీ, కాంట్రాక్టర్లకు గానీ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో వేగంగా గృహ నిర్మాణాలు సాగుతున్నాయి. రోజుకు రెండువేల ఇళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే 3,61,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 47 వేల ఇళ్లు ఆర్‌సీ స్థాయిలో ఉన్నాయి. అంటే ఈ ఇళ్లు మరో 20 రోజుల్లో ప్రారంభోత్సవానికి రెడీ అయిపోతాయి. దీంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ కట్టే ఇళ్లే నాలుగు లక్షలు దాటుతుండగా, మరో లక్ష టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తయి సిద్దంగా ఉన్నాయి. మొత్తం మీద ఈనెల చివరి నాటికి ఐదు లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా జరపడానికి సిద్దమైపోతున్నారు.

- Advertisement -

అమరావతి రాజధానిలోనూ పేదలకు ఇళ్ల నిర్మాణం

అమరావతి రాజధానిలోని గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇటీవలే దీనికి సంబంధించి లీగల్‌ అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో రాజధాని గ్రామాల్లో ఎన్టీయార్‌, గుంటూరు జిల్లాలకు చెందిన 20 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే వారికి ఇళ్లు నిర్మించే ప్రక్రియ మొదలు పెడతామని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండి లక్ష్మీషా చెప్పారు. పట్టాల పంపిణీ పూర్తవ్వగానే ఇళ్లు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, వారు కూడా సానుకూలంగా ఉన్నారని, ప్రతిపాదనలకు ఆమోదం పొందగానే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement