Friday, November 22, 2024

Big Story | ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకం.. మూసివేత దిశగా పయనం

అమరావతి,ఆంధ్రప్రభ: ఒకప్పుడు రాష్ట్రంలో విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్దకంగా మారింది. రాష్ట్రంలో 1180 వరకు ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలు ఉండగా ఈ ఏడాది 831 కాలేజీలు మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. 171 కాలేజీలు యూనివ ర్శిటీలకు ఫీజు కట్టకుండానే మిన్నకుండిపోయాయి.

వీటి నిర్వహణ కష్టమవ్వడంతో ఇవి మూత దిశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన 24, 25 జీవోల ద్వారా మరో 180 కాలేజీలపై వేటు వేసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. గత మూడేళ్ల కాలంలో కరోనా తర్వాత అన్ని రకాల ఖర్చులు పెరిగాయి. ఆ ఖర్చులకు అనుగుణం గా ఫీజులు మాత్రం పెంచలేదని ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

30 శాతం పెరిగిన ఖర్చులు…కానీ ఫీజుల్లో మాత్రం పెరుగుదల లేదు

కరోనా తర్వాత అన్ని రంగాల్లో ఖర్చులు పెరిగినట్లే ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలకు కూడా వ్యయం పెరిగిపోయింది. ప్రతి ఏటా యూనివర్శిటీలకు చెల్లించాల్సిన అఫ్లియేషన్‌ ఫీజు ఐదు నుండి పది శాతం పెరిగింది. ఈ కాలంలో లెక్చరర్ల జీతాలు పెరిగాయి. కరెంట్‌ బిల్లులు పెరిగిపోయాయి. బిల్డింగ్‌ అద్దెలు పెరిగాయి. మొత్తంగా దాదాపు 30 శాతం వరకు ఖర్చులు పెరిగాయి. కానీ ఫీజుల్లో మాత్రం ఎటువంటి పెరుగుదల లేదు. బిఎస్‌సి కోర్సుకు రూ. 15 వేలునే నిర్ణయించారు. బికామ్‌ కోర్సుకు రూ. 12 వేలునే కొనసాగిస్తున్నారు. గత ఏడాది ఏ గ్రేడ్‌లో ఉన్న 140 కాలేజీల్లో 90 శాతం కాలేజీలకు ఈసారి ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వలేదు.

మొత్తం 830 కాలేజీల్లో ఏ 30 కాలేజీలకు మాత్రమే కొద్దొగొప్పో ఫీజులు పెరిగాయి. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మాత్రం రిస్ట్రక్చర్డ్‌ కోర్సుల పేరుతో దాదాపు కోర్సుకు ఫీజు 20 వేల వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. మరోవైపు యూనవర్శిటీలకు అఫ్లియేషన్‌ ఫీజు కట్టిన తర్వాత కూడా 25 శాతం లోపు విద్యార్ధులు ఉన్నారనే నెపంతో ఆ కాలేజీలకు ఫీజును రికమండ్‌ చేయలేదు. దీంతో ఆ కాలేజీలు మూతపడే పరిస్థితి. మరోవైపు ఫీజు నిర్ణయించడానికి సరైన సమాచారం ఇవ్వలేదని మరో 30 కాలేజీలకు కూడా ఫీజు రికమండ్‌ చేయలేదు. దీంతో ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది.

నాణ్యమైన విద్య అందేనా..?

ఈ ఏడాది నుండి డిగ్రీ కాలేజీల్లో నూతన విద్యా విధానం సిఫార్సు మేరకు సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సులు సమర్ధవంతంగా బోధించాలంటే చాలా మౌళిక సదుపాయాలు అవసరం. ల్యాబ్‌లు అవసరం. మంచి లెక్చరర్లు అవసరం. అదీ కూడా ఎక్కువ సంఖ్యలో అసవరం. అదీ కాక నాలుగో ఏడాదిలో రీసెర్చ్‌ మోడ్‌లో ఈ కోర్సు సాగాల్సి ఉంటుంది. సాధారణ డిగ్రీ కోర్సులనే నడపలేమని చేతులేత్తేస్తున్న ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలు ఇక నూతన విద్యా విధానాన్ని ఎలా అమలు చేస్తాయి అనేది ప్రశ్నార్ధకంగా ఉంది.

ఈ కాలేజీల్లో చేరే విద్యార్ధుల పరిస్థతి ఏందనేది ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడున్న ఫీజులతో నాణ్యమైన విద్య అందించలేమని ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలు అంటున్నాయి. ఫీజులు తక్కువగా ఉండడంతో ఏ కాలేజీల్లో అయితే పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరగుతాయో ఆ కాలేజీల్లో కొంతమేరుకు నాణ్యమైన విద్య అందించే అవకాశముంది. కానీ చాలా కాలేజీల్లో 35 నుండి 50 శాతం వరకు మాత్రమే అడ్మిషన్లు అవుతున్నాయి. మరి కాలేజీల్లో చదివే విద్యార్ధుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకరంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement