న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొనసాగుతున్న కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ సీబీఐని ప్రశ్నించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ రఘురామకృష్ణ రాజును ప్రతిపక్ష పార్టీ నేతగా ధర్మాసనం భావించగా.. ఆయన తరఫు న్యాయవాది ఒకే పార్టీకి చెందిన నేత అంటూ వివరించారు. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూరఘురామ ఈ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ కేసు 3,071 సార్లు వాయిదా పడిందని తెలిపారు. జగన్ ప్రత్యక్ష హాజరుకు కూడా సీబీఐ కోర్టు మినహాయింపునిచ్చిందని తెలిపారు. వందల కొద్ది డిశ్చార్జి పిటీషన్లు వేశారని, కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి కేసుల విచారణ బదిలీ చేసి విచారణ వేగంగా ముందుకు సాగేలా ఆదేశాలివ్వాలని రఘురామ తన పిటిషన్‌లో అభ్యర్థించారు.