Friday, November 22, 2024

మోడీకి క్లీన్‌చిట్ సమంజసమే.. నిగూఢ లక్ష్యమేదో ఉన్నట్టుందని సుప్రీంకోర్టు వ్యాఖ్య

గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సహా మరో 63మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్‌ ఇవ్వాడన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిట్‌ నిర్ణయాన్ని సమర్ధిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్త్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రత్యేక బృందం నిర్వహించిన దర్యాప్తును, చిత్తశుద్ధిని శంకించడానికి, ప్రశ్నించడానికి తగిన కారణాలు ఏవీ కన్పించడం లేదని స్పష్టం చేసింది. ఈ వివాదం నిరంతరం సలసల కాగుతూండాలనే ఈ అప్పీల్‌ పిటిషన్లు వేసినట్లు కన్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 16 ఏళ్లపాటు కేసు నడిచిందని, లెక్కలేనన్ని దరఖాస్తులు, పిటిషన్లు దాఖలైనాయని, దీనినిబట్టి పిటిషర్లకు నిగూఢ లక్ష్యమేదో ఉందని భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. వాస్తవాలకు దూరంగా ఉన్న కారణాలతో పిటిషన్‌ వేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. 2002 ఫిబ్రవరి 28న గుజరాత్‌లో జరిగిన అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, మరో 63 మంది ప్రమేయం కాని, అధికారయంత్రాంగం కుట్ర కానీ లేదంటూ సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

దానిని గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది. అయితే సిట్‌ దర్యాప్తు సరిగా జరగలేదని, మోడీకి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం సరికాదని ఆరోపిస్తూ ఆనాటి అల్లర్ల బాధితురాలు, గుల్బర్గా సొసైటీపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ నేత ఈషాన్‌ జాఫ్రి సతీమణి జకియా జాఫ్రి సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌వికార్‌, దినేష్‌ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారంనాడు 308 పేజీల తీర్పును వెలువరించింది. జకియాతోపాటు మరో పిటిషనర్‌,హక్కుల ఉద్యమకారిణి తీస్తా సెటల్‌వాడ చేసిన ఆరోపణలను తప్పుబడుతూ మొట్టికాయలు వేసింది. ఈ సందర్భంగా ధర్మా సనం కీలక వ్యాఖ్యలు చేసింది. గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) సుప్రీంకోర్టే నియమించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం పిటిషనర్‌ వాదనలను తప్పుబట్టింది. సిట్‌ సమగ్రతను, చిత్తశుద్ధిని తక్కువచేసి చూపుతూ చేసిన వాదనలు వాస్తవదూరంగా ఉన్నాయని, ఈ వివాదం నిరంతరం కొనసాగడమే పిటిషనర్‌ ఉద్దేశంగా కన్పిస్తోందని ఆక్షేపించింది. అదీగాక, న్యాయస్థానం మేధస్సును, జ్ఞానాన్ని ప్రశ్నించేలా పిటిషనర్‌ ఆరోపణలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. విస్తృత దర్యాప్తు చేసిన సిట్‌, అనేక ఆధారాలు సేకరించి నివేదిక సమర్పించిందని, ఇప్పుడు దానిని తప్పుబట్టాల్సిన పని లేదని, వాటిని మించి కొత్త ఆధారాలేమీ లేకుండా కేవలం ఆరోపణలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది.

జకియా మనోభావాలను రెచ్చగొట్టి తీస్తా సెటల్‌వాడ తప్పుదారి పట్టించిందని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో దర్యాప్తు వెనుక కుట్ర ఉందని, అల్లర్లు జరిగినప్పుడు పోలీసు, అగ్నిమాపక, పరిపాలనా విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, గులబర్గా సొసైటీపై దాడిని, అల్లర్లను అదుపు చేయడానికి కనీస చర్యలు చేపట్టలేదని జకియా ఆరోపించారు. అధికారుల కుట్రలను, తమ ఆరోపణలను సిట్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఆరోపణలకు ఆధారంగా ఆమె తెహెల్కా మ్యాగజైన్‌ కథనాలను, మాజీ ఐపీఎస్‌ అధికారులు సంజీవ్‌ భట్‌, హరేన్‌ పాండ్యా, ఆర్‌బీ శ్రీకుమార్‌ల వ్యాఖ్యలను చూపారు. అల్లర్లను ప్రోత్సహిస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఆదేశించారంటూ ఆ ఐపీఎస్‌లు ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఆ ఆరోపణలపై సిట్‌ దర్యాప్తు చేసిందని, ముఖ్యమంత్రి నిర్వహించినట్లు చెబుతున్న సమావేశానికి అసలు ఆ అధికారులు హాజరే కాలేదని తేలిందని సుప్రీం పేర్కొంది. అందువల్ల సిట్‌ దర్యాప్తును శంకించబోమని స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్‌ పేర్కొన్నట్లు భారీ ఎత్తున అల్లర్లు జరిగినప్పుడు కొందరు అధికారులు సరిగా వ్యవహరించకపోయి ఉండవచ్చని, అంతమాత్రాన దానిని కుట్రగా భావించలేమని అభిప్రాయపడింది. అప్పటి గుజరాత్‌ పరిపాలనా యంత్రాగానికి, సిట్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంలో శంకించాల్సినది ఏమీ లేదని స్పష్టం చేసింది. మోడీ సహా 63మందికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సిట్‌ ఇచ్చిన నివేదికను ట్రయల్‌ కోర్టు అయిన గుజరాత్‌ హైకోర్టు సమర్ధించగా జకియా సుప్రీంను ఆశ్రయించారు. కాగా ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత డిసెంబర్‌లో తీర్పును రిజర్వు చేసింది. సిట్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహిత్గి వాదనలు విన్పిస్తూ జకియా, తీస్తా సెటల్వాటా పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. కాగా జకియా తరపున కపిల్‌ సిబల్‌ వాదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement