న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ఏడాది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మారిందని, ఈ పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరో 4 వారాలు సమయం కావాలని ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ బెంచ్ ఎదుట జరిగిన విచారణలో పిటిషనర్ అభ్యర్థనకు అంగీకరించిన ధర్మాసనం మార్చి 6కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
తెలంగాణలో నాటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు డబ్బు ఆశజూపి పార్టీ ఫిరాయింపులకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితులుగా ఉన్న పలువురు వ్యక్తులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సీబీఐకు అప్పగించాలని కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు సింగిల్ జడ్జ్ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాటి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టు తీర్పుపై స్టే కోరగా.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఆ తర్వాత కేసు విచారణ వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి మార్చి 6కు వాయిదా పడింది.