Tuesday, November 26, 2024

Telangana | రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుంటున్నారు.. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో రేవంత్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఆదివాసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాల రక్షణ కోసం… హక్కుల సాధన కోసం నాటి కాకతీయ రాజులకు తిరుగుబావుట ఎగురవేసి పోరాడిన సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో మేడారంలో పడిన అడుగు కేసీఆర్‌ పాలనను పాతాళంలోకి తొక్కేవరకు ఆగదని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి నేరుగా ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం మేడారానికి చేరుకుని అక్కడ వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండలం పస్రా జంక్షన్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ, ఆనాడు 2003లో వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల చెల్లమ్మ నియోజకవర్గం నుంచి పాదయాత్రను చేపట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాం గ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమ పాలనను అందించారని గుర్తుచేస్తూ గల్లి నుంచి ఢిల్లి వరకు ములుగు నియోజకవర్గ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మీ అభిమాన నాయకురాలు, మా ఇంటి ఆడబిడ్డ ములుగు ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గం నుంచి ప్రారంభించిన పాదయాత్ర కేసీఆర్‌ పాలనను అంతం చేసేవరకు కొనసాగిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఏకం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మతవిద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని విచ్చిన్నం చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మూడు తరాల త్యాగాల పోరాటాలతో దేశాన్ని ముందుకు నడిపిన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దేశాన్ని ఏకం చేసేందుకు కోసం రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు 140 రోజుల్లో 4080 కిలోమీటర్లు భారత్‌ జోడో యాత్రను చేశారని, ఆ యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామాన గూడేలు, తండాలకు ప్రతి ఇంటికీ చేరవేసేందుకు కోసం హాత్‌ సే హాత్‌ జూడో యాత్రను నిర్వహిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

9 ఏళ్లలో 25 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టి దోచుకున్నారు..

అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ల్లల్లో 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ పెట్టి కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని రేవేంత్‌రెడ్డి విమర్శించారు. 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ అంటే ప్రతి నియోజకవర్గానికి 20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి నియోజకవర్గంలో కనిపిస్తుందా.. అంటూ సబికులను ప్రశ్నించారు. అమరుల త్యాగాలను కాలగర్భంలో కలపాలని చూస్తున్న కేసీఆర్‌ పాలనను ఇంకా భరిద్దామా.. కలిసి పోరాడుదామా… అంటూ సబికులను ప్రశ్నించారు. తొమ్మిదేళ్లల్లో ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇంకెంత కాలం కేసీఆర్‌ కుటుంబ దోపిడీని భరిద్దాం.. అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్‌ సంక్షేమం అంటే కుటుంబంలో భార్యకు పెన్షన్‌ ఇచ్చి భర్తకు ఇవ్వకపోవడమా…? లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ కాకపోవడంతో అప్పు పె రిగి వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడ మే సంక్షేమమా..? విద్యార్థులకు 5 వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సంక్షేమమా..? ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడమే సంక్షేమమా..? దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వకపోవడమే సంక్షేమమా..? డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇస్తామని ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్డటమే సంక్షేమమా..? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

సంక్షేమ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం..

రైతులకు 2 లక్షల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజురీఎంబర్స్‌మెంట్‌, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం, నిరుపేదలందరికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన అంతమై కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రావాలని రేవంత్‌రెడ్డి పిలుపుని చ్చారు. ఎన్నికల్లో ఇచ్చే డబ్బులు, మద్యం మత్తుకు అమ్ముడుపోకుండా నిక్కార్స్‌గా నిలబడి మాట్లాడినప్పుడే కేసీఆర్‌ దుర్మార్గపు పాలన అంతమవుతుందని, అందుకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త సైనికులై పోరాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎస్సారెస్పీ నీళ్లను పక్క రాష్ట్రానికి ఎలా ఇస్తారు..?

ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కడుతున్న బాబ్లి ప్రాజెక్టును అడ్డుకునేందుకు పోరాడాం. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాందేడ్‌ సభలో ఎస్సారెస్పీ నీళ్లను తోడుకోండంటూ ఎలా చెబుతార ని టీపీసీసీ ఎ న్నికల క్యాంపెయిన్‌ చైర్మన్‌ మాజీఎంపీ మధుయాష్కిగౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు చేదోడువాదోడుగా మీ అభిమాన నాయకురాలు సీతక్క పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ తిరిగి ఆదుకుంటే కేసీఆర్‌ బిడ్డ కవిత ప్రజల ప్రాణాలు తీసే లిక్కర్‌ స్కాంలో వందల కోట్ల రూపాయలను తీసుకున్నదని మధుయాష్కి ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాకరే, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ నవీన్‌జావేద్‌, ఏఐసీసీ నాయకులు బోసు రాజు, రోహిత్‌ చౌదరి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, స్థానిక నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మేడారంలో ప్రత్యేక పూజలు..

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రేవంత్‌ రెడ్డి పోరాటాలకు ప్రతిరూపాలైన, ఆదివాసీ హక్కుల కోసం కాకతీయుల రాజులను ఎదురించిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్‌రెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలికి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోడెం వీరయ్య, టీపీసీసీ వర్కింగ్‌ అధ్యక్షులు అంజనికుమార్‌యాదవ్‌, కేంద్రమాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement