భువనగిరి బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాకనే కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించారని మండిపడ్డారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం.. వైఫల్యలాను ఎత్తిచూపితే దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ చేసిన మోసాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే దిగజరి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
హింస, విద్వంసం, గుండాగిరి తమ ట్రేడ్‌మార్క్ పాలన అని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసిందన్నారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పోజులు కొట్టే రాహుల్ గాంధీకి రేవంత్ హయాంలో తెలంగాణలో జరుగుతున్న ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు తెలియడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాహుల్ తన హిపోక్రసీని కట్టడి చేసి గూండాల చేతుల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చక్కదిద్దాలని సూచించారు.