రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధమైన విధానాలు ఆర్థిక క్రమశిక్షణతో అన్ని రంగాలలో ముందంజలో ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన సంగారెడ్డి కలెక్టరేట్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ అన్ని విధాల రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా కు గోదావరి జలాలు తరలించాలని, జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయడానికి, కాలంతో పనిలేకుండా పంటలకు సాగునీరు అందించేలా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ రెండు ఎత్తిపోతల ద్వారా జిల్లాలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతు బంధు పథకం కింద గత 8 విడతలలో 21.76 లక్షల మంది రైతులకు రూ.2,536 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. తొమ్మిదవ విడత రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భీమా పథకం కింద 919 మంది రైతులకు రూ.45.95 కోట్లు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 1068 నీటి వనరులలో వంద శాతం సబ్సిడీపై 3.76 కోట్ల రూపాయల విలువ గల 3.58 కోట్ల చేప పిల్లల పెంపకం చేపట్టి, 16,174 టన్నుల చేపల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. రబీ సీజన్లో 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసామన్నారు. దళిత బంధు పథకం కింద జిల్లాలో 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇప్పటివరకు 381 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులతో సేవలందిస్తున్నామనీ, జిల్లాలో ఆరు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఏడు బస్తీ దావఖానలు జిల్లాకు మంజూరైనట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12,847 కెసిఆర్ కిట్ల పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో 441 పాఠశాలలను ఎంపిక చేసామని, పాఠశాల పున ప్రారంభం నాటికి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
హరితహారం కార్యక్రమం లో రోడ్డుకిరువైపులా చెట్ల పెంపకం లో గత సంవత్సరం సంగారెడ్డి మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని, అదేవిధంగా పిఎం స్వనిధి క్రింద వీధి వ్యాపారులకు మొదటి విడత రుణాల మంజూరులో జహీరాబాద్ మున్సిపాలిటీ దేశంలో ఆరవ స్థానం, సంగారెడ్డి మున్సిపాలిటీ 9వ స్థానంలో నిలిచిందని తెలిపారు. రెండవ విడత రుణాల మంజూరులో సంగారెడ్డి దేశంలో ఏడవ స్థానం జహీరాబాద్ 10వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ఈ నెల 3 నుండి ప్రారంభమయ్యే ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. 8వ విడత హరితహారాన్ని విజయవంతం చేసి జిల్లాను హరిత జిల్లాగా రూపొందించాలని కోరారు.
అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించింది : హోం మంత్రి మహమూద్ అలీ
Advertisement
తాజా వార్తలు
Advertisement