Tuesday, November 19, 2024

67వ రైల్వే వారోత్సవాలు, ఐదు అఖిల భారత పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ షీల్డ్‌లను కైవసం చేసుకున్న రైల్వే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారతీయ రైల్వేలోని ఇతర జోన్ల కంటే దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా మొత్తం ఐదు ”అఖిల భారత పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ షీల్డులను” కైవసం చేసుకొని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 67వ రైల్వే వారోత్సవాల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం భువనేశ్వర్‌లోని రైల్‌ ఆడిటోరియంలో జరిగింది. వివిధ రంగాలలో గత సంవత్సరంలో విశిష్టమైన పనితీరును ప్రదర్శించినందుకుగాను దక్షిణ మధ్య రైల్వే సెక్యూరిటీ, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ, సివిల్‌ ఇంజినీరింగ్‌, స్టోర్స్‌ మరియు సివిల్‌ ఇంజినీరింగ్‌ (కనస్ట్రక్షన్‌) విభాగాలలో అఖిల భారత పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ షీల్డులను సాధించింది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ షీల్డులను అందజేశారు. రైల్వే బోర్డు చైెర్మన్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వి.కె.త్రిపాఠి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాలకు చేరుకునేలా అభివృద్ధి చెందడానికి భారతీయ రైల్వే రూపాంతరీకరణ ఎంతో తోడ్పడుతుందన్నారు. రైల్వేల పరివర్తన భారత ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చగలదన్నారు. దీనికి సంబంధించి రోలింగ్‌ స్టాక్‌, నిర్మాణ పనులు, భద్రత, సైబర్‌ భద్రత అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతంగా శోధించి అందిపుచ్చుకోవడానికి కృషి చేయాలన్నారు. రైల్వే అభివృద్ధి కోసం పెట్టుబడుల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించిన మంత్రి 2014 నుండి రైల్వేలో పెట్టుబడుల పెంపునకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని, ఈ సంవత్సరం అది ఒక లక్షా 37 వేల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం క్రింద ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్ధేశ్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు ఆధ్వర్యంలో కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

రైల్వే బోర్డు చైర్మన్‌ త్రిపాఠి తమ స్వాగతోపన్యాసంలో భారతీయ రైల్వేలు ఇటీవల కాలంలో పరివర్తనతో అభివృద్ధి చెందుతున్న అంశాల గురించి తెలియజేశారు. దేశవ్యాప్తంగా వివిధ జోనల్‌ రైల్వేలకు చెందిన మొత్తం 156 మంది రైల్వే సిబ్బంది గౌరవ రైల్వే శాఖ మంత్రి చేతుల మీదుగా విశిష్ట సేవలకు గాను అత్యుత్తమ సేవా సర్టిఫికేట్లను, అవార్డులను అందుకున్నారు. ఇవేకాక వివిధ రైల్వే జోన్లకు, ఉత్పత్తి యూనిట్లకు, రైల్వే పిఎస్‌యూల విశిష్ట పనితీరు, సామర్థ్యానికి గుర్తింపుగా షీల్డులు అందజేశారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌తో పాటు జోన్‌లోని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు రాజారామ్‌ (సెక్యూరిటీ షీల్డు), వి.సుధాకర్‌ రావు (స్టోర్స్‌ షీల్డు), సంజీవ్‌ అగర్వాల్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌ షీల్డు), అమిత్‌ గోయల్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌ కనస్ట్రక్షన్‌ షీల్డు), సి.కె.వెంకటేశ్వర్లు (సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ షీల్డు) లను అందుకున్నారు.

గత సంవత్సరంలో విశిష్టమైన పనితీరు ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వేకి చెందిన ఐదుగురు అధికారులు, ఐదుగురు సిబ్బంది మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న వారిలో సెంట్రల్‌ ఆసుపత్రి అడిషినల్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. ఎస్‌.సునిల్‌ కుమార్‌, విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ టెలికామ్‌ ఇంజినీర్‌ ఆర్‌.విశ్వనాథ్‌ రెడ్డి, #హదరాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ (కోఆర్డినేషన్‌) మోతిలాల్‌ భూక్యా, డిప్యూటీ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికాం ఇంజినీర్‌ (ప్రాజెక్ట్స్‌) ప్రియా అగర్వాల్‌లు అవార్డులు అందుకున్నారు. వీరేకాక, సికింద్రాబాద్‌ డివిజినల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ సురేష్‌ రెడ్డి, విజయవాడ డివిజన్‌ ఆర్‌పిఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, తిరుపతి గ్యారేజీ రిపేర్‌ షాపు సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ జయ ప్రకాశ్‌, హెడ్‌క్వార్టర్స్‌ అకౌంట్స్‌ విభాగం సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ కె.వి. శ్రీనివాసు, లోకో పైలట్‌ (ప్యాసింజర్‌) జి.హెచ్‌.ప్రసాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ లోకో పైలట్‌ (గూడ్స్‌) బి.శ్రీనివాస్‌గౌడ్‌లు వ్యక్తిగత అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ భారతీయ రైల్వేలోని అన్ని జోన్లతో సమానంగా జోన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో అద్భుతమైన ఫలితాలను పొందడంలో అంకితభావంతో విశేషంగా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వివిధ రంగాలలో ఐదు పెర్ఫార్మెన్స్‌ షీల్డులను కైవసం చేసుకోవడంపై ఆయన #హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అవార్డులు పొందిన సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు. వారి ప్రశంసనీయమైన పనితీరును కొనియాడారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement