Monday, November 25, 2024

Big story | ఆర్టీసీ ఆదాయానికి గండి.. షటిల్‌ సర్వీసులుగా మారిన‌ ప్రైవేటు వాహనాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండి కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సులను నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఆయా పట్టణాలకు నడుపుతుండగా, ప్రైవేటు వాహనాల నిర్వాహకులు రద్దీని బట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆదాయం గడిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైనే రోజుకు దాదాపు 700 వాహనాల వరకూ షటిల్‌ సర్వీసుల మాదిరిగా నడుస్తున్నట్లు అంచనా. ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, చైతన్యపురి, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపే ప్రదేశంలోనే.. ఆర్టీసీ బస్సులో వెళితే 6 గంటలు, మేం కేవలం 4 గంటల్లోనే విజయవాడలో దింపుతామంటూ ఆకర్శిస్తున్నారు. ఈ ప్రైవేటు వాహనాలలో ఎక్కువగా ఇన్నోవా, ఎర్టిగా, స్విఫ్ట్‌ వంటి లగ్జరీ వాహనాలే ఉండటం గమనార్హం. కాగా, విజయవాడ హైవే విస్తరించిన తరువాత ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా తరువాత ప్రజలు ఎక్కువగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు తమ సొంత వాహనాలపైనే ఆధారపడుతుండటంతో ఈ హైవేపై వాహనాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది.

దీంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకోవాలంటే వేగంగా వెళ్లే సామర్థ్యమున్న కార్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ 55 శాతం మాత్రమే ఉంటోంది. ఈ మార్గంలో ప్రతీ రోజూ టీఎస్‌ ఆర్టీసీ 254 బస్సు సర్వీసులను నడుపుతున్నది. వీటిలో 115 నాన్‌ ఏసీ బస్సులు, మిగతావి రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ సర్వీసులు.ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర్ర సర్వీసుల ఒప్పందం ప్రకారం ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా 225 బస్సులను నడుపుతున్నది. అయితే, ప్రైవేటు వాహనాల కారణంగా కనీసం 20 సర్వీసులకు డీజిల్‌ ఖర్చుకు సరిపడా డబ్బులు కూడా రావడం లేదని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్‌ ఆర్టీసీతో పోలిస్తే 4 గంటల్లో విజయవాడకు చేరవేస్తుండటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలలో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఒక్కో ప్రయాణికుని నుంచి రూ.600 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారు.

ఇలా ఒక్కో కారులో ఐదు నుంచి 8 మందిని చేరవేస్తూ ఒక్క ట్రిప్పులోనే దాదాపు రూ.7 వేల వరకు సంపాదిస్తున్నారు. ప్రతీ రోజూ రూ.వేల ఆదాయం వస్తుండటంతో ఈ రూట్‌లో తిరిగే ప్రైవేటు వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు దాదాపు రెండు గంటల సమయం కలిసి వస్తుండటంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి సైతం ప్రైవేటు వాహనాలలో ఆశ్రయిస్తున్నారు. అయితే, సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్శిస్తున్న టీఎస్‌ ఆర్టీసీ ప్రైవేటు వాహనాలపై మాత్రం దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వరంగల్‌, హన్మకొండ, జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, కోఠి నుంచి ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాలకు ప్రైవేటు వాహనాలు ప్రతీ రోజూ వందల సంఖ్యలో నడుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement